Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 5:54 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు ఎమ్మార్పీఎస్ నల్ల జెండాల ప్రదర్శన

 

. . . మాదిగలను రాజ్యసభ సీటు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ

 

. . . భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధి చేస్తాం

 

. . . ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు రాజ్యసభలో ఒక సీటు కల్పించడంలో మోసం చేసినందుకు నిరసనగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ 2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిత్యం మాదిగలకు మోసం చేస్తూనే ఉందని తెలియచేశారు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉంటే ఒకటి అంటే ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12% ఉన్న మాదిగలకు వర్గీకరణ చట్టం ప్రకారం 11% రావాల్సింది ఉండగా కూడా 9% ఇచ్చి మాదిగలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియచేశారు. ఆ సమయంలో కూడా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలకు జనాభా ప్రకారం 11% రిజర్వేషన్లు కల్పించాలని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో నిరసన దీక్షలు చెయ్యడం జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంటులో ఇది వరకే 7 గురు రెడ్డి కులస్తులు ఉండగా కూడా రేవంత్ రెడ్డి తన సొంత మిత్రుడైన వేం నరేందర్ రెడ్డి కి మళ్ళీ చోటు కల్పించడం అంటే ఇది ప్రజాపాలన కాదు రెడ్ల పాలన అని తెలుస్తుందని, కొంచెం కూడా సామాజిక న్యాయాన్ని పాటించకుండా రెడ్ల పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేసినందుకు రేపటి నుంచి ఈ నెల 13 వరకు వివిధ రూపాలలో నిరసనలు తెలియచేస్తామని, సమాజంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఎండగడుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధమల నాగభూష్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారం రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షుడు మహేష్ మాదిగ, మోహన్ మాదిగ, సత్యం మాదిగ, అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

 

MRPS black flag display in front of Congress party office