. . . నిరాహార దీక్షకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం
. . . మహిళ అయిన భోగ శ్రావణిని గాయాలయ్యేలా ఈడ్చుకెళ్తారా అంటూ ప్రశ్న
. . . ఈరోజు తేది జీవితంలో గుర్తుండేలా చేస్తానన్న ఎంపీ అర్వింద్
జగిత్యాల, బతుకమ్మ :
ఈ నెల 18న చల్గల్ శివారులో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలో నిరాహార దీక్ష నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు పోలీసులను అనుమతి కోరగా, అధికారులు అనుమతి నిరాకరించారు. దీనికి నిరసనగా శనివారం సాయంత్రం బీజేపీ నాయకురాలు బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించగా, పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు. మహిళలు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, గాయాలయ్యేలా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లో స్టేషన్‌కు తరలించగా, విషయం తెలుసుకున్న ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కాంగ్రెస్ కు కూడా అదే తహసీల్ చౌరస్తాలో నిరసనలకు అనుమతులు ఇచ్చారని, అయితే బీజేపీకి మాత్రమే ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే, “మా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు” అంటూ హెచ్చరిస్తూనే, ఈ వ్యవహారంపై డీఓపిటీలో ఫిర్యాదు చేస్తానని, జీవితంలో ఈరోజు తేది గుర్తుండేలా చేస్తానని అన్నారట. మహిళలపై అక్రమ అరెస్టులు చేయడాన్ని తప్పుబడుతూ, “గాయాలయ్యేలా తీసుకెళ్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఎవరికి గాయాలవ్వలేదని ఎస్పీ తెలపగా, అబద్ధాలు ఆడవద్దని, ప్రభుత్వాలకు చెంచాగిరి చేయవద్దని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే తానే జగిత్యాలకు వస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఎంపీ ఫోన్ కాల్ అనంతరం పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయడం గమనార్హం.