. . . సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కమ్యూనిస్టులపై, కమ్యూనిస్టు భావజాలంతో నడిచే పత్రికలపై చౌకబారు విమర్శలు చేయడం జిల్లా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మానుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కమ్యూనిస్టులు లేరన్నట్టుగా, దేశంలో “కమ్యూనిస్టు విముక్త భారత్” జరిగిపోయినట్టుగా వ్యాఖ్యానించడం తగదని విమర్శించారు. దేశంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, సామాజిక వివక్ష కొనసాగుతున్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం ఉంటుందని, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం కమ్యూనిస్టు విముక్త భారత్ అనే ఆలోచనతో ఉండవచ్చని, కానీ ప్రజల నుంచి కమ్యూనిస్టులను వేరు చేయడం సాధ్యం కాదని అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులేనని, బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కాదని ఆయన పేర్కొన్నారు. పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, వివక్షత ఉన్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతుందని, దానిని రూపుమాపే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య మతపరమైన విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేసే వారికి కమ్యూనిస్టుల విలువలు, త్యాగాలు అర్థం కావని రమేష్ బాబు అన్నారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో అధికారంలో ఉన్నప్పుడే పార్టీలు ఉన్నట్లయితే, బీజేపీ కూడా తన ప్రారంభ దశల్లో అధికారంలో లేకపోయిందని, మరి అప్పుడు బీజేపీ కూడా “ముక్త భారత్” అయిపోయిందా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.