Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:50 pm Posted by : ramakrishna

అదనపు నిధుల కోసం మంత్రి కోమటి రెడ్డికి ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ లోని మాదవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం అదనపు నిధులను తక్షణమే మంజూరు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కోరారు. సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆర్వోబి పనుల పురోగతిపై చర్చించారు. ఆర్వోబి పనులకు సంబందించి సవరించిన అంచనాల ప్రకారం రూ.8.68 కోట్ల అదనపు నిధులు గత 15 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని, దీని వల్ల పనులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతుందని మంత్రికి వివరించారు. ఈ నిధులకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే పనులు వేగవంతమవుతాయని ఎంపీ పేర్కొన్నారు. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అదనపు నిధులకు సంబందించి వెంటనే మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను ద్రష్టిలో ఉంచుకుని పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇప్పటికీ మామిడిపల్లి, అడవి మామిడి పల్లి ఆర్వోబీలు పూర్తి కాగా మాధవ్ నగర్, అర్సపల్లి పనులు నిధుల విడుదల జాప్యంతో మెల్లిగా సాగుతున్నాయి. ఆర్వోబీలకు కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో ఎంపీ అర్వింద్ ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆర్ అండ్ బి మినిస్టర్లకు విన్నవించారు. గతంలో ఆర్వోబి నిధుల కోసం ఎంపీ అర్వింద్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమైన నేపధ్యంలో ప్రభుత్వం నిధుల విడుదలకు అంగీకరించింది. అయినప్పటికీ రాష్ట్ర వాటా విషయంలో ఆలస్యమవుతుండడంతో మరో సారి రాష్ట్ర మంత్రిని కలిసి నిధుల విడుదలను వేగిరం చేయాలని విన్నవించారు.