. . . బోర్గాం బ్రిడ్జి వద్ద పోలీసుల నాకాబందీ
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వాహనదారులు పోలీసులకు సహకరించాలని, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం సాయంత్రం విస్తృతంగా నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏకకాలంలో వాహన తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం బ్రిడ్జి వద్ద సీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా తనిఖీలను పర్యవేక్షిస్తూ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు తదితర పత్రాలను పోలీసులు పరిశీలించారు. నంబర్ ప్లేట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, వాహనానికి సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ప్రత్యేకంగా తనిఖీ చేసి, వాహనదారుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని సూచించారు. నంబర్ ప్లేట్లను నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నివారణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెంచేందుకు కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక నాకాబందీలు, వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోర్త్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. సతీష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీసీఎస్ సీఐ అజయ్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
