Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 7:19 pm Posted by : ramakrishna

చిన్నారి హత్య కేసులో తల్లి, మరో వ్యక్తికి జీవితఖైదు 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి, సహకరించిన చిన్నారి తల్లికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి  గ్రామానికి చెందిన సేవేళ్ళ సంజీవ్ కు పని చేసే సమయంలో మోర్తాడ్ వద్ద నిర్మల్ జిల్లా రాంనగర్ కు చెందిన చెంచు రజిత ఆలియాస్ రాధాతో పరిచయం ఏర్పడింది. రజితకు అప్పటికే మూడు సంవత్సరాల అమ్ములు అనే చిన్నారి ఉంది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజులకు మోర్తాడ్ నుంచి సంజీవ్ తన సొంతూరు కల్దుర్కికి మకాం మార్చాడు. అయితే తన ఏకాంత సమయానికి బాలిక అడ్డుగా ఉందని బాలికను ఇద్దరు కలిసి చిత్రహింసలకు గురి చేశారు. 2023 ఏప్రిల్ 11న రాత్రి వేళ లేచి ఏడుస్తున్న అమ్ములును సంజీవ్ కర్రతో కాలుపై కొట్టాడు. దానితో కాలు విరిగి చిన్నారి విపరీతంగా ఏడ్చింది. దాంతో ఇద్దరు కలిసి ముక్కునోరు  మూసివేయడంతో అమ్ములు స్ప`హ  తప్పింది. అప్పుడు సంజీవ్ బాలికను తీసుకుని స్థానికంగా  రామన్ చెరువు వద్దకు తీసుకెళ్లి తలకిందులుగా బాలికను నీళ్ళలో చనిపోయే వరకు ఉంచారు. అక్కడే ఉన్న తూటిపొదల్లో పారవేశాడు. ఈ కేసులో బోధన్ రూరల్ పోలీసులు సంజీవ్, రజితలపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ బుధవారం ఇద్దరికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అంతేగాకుండా ఈ కేసులో సాక్ష్యాదారాలను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఇద్దరికి మూడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో సంజీవ్ కు అదనంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.