Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 5:24 pm Posted by : ramakrishna

విద్యను మోడీ ప్రభుత్వం కాషాయీకరిస్తుంది

  • కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యను మోడీ ప్రభుత్వం కాషాయీకరిస్తుందని కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలను జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ నిర్వహించారు. పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే. గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్నదని ఆరోపించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సింది పోయి, మతోన్మాదాన్ని మూఢనమ్మకాలను పెంచి పోషించే విధానాలు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ నూతన విద్యా విధానం పేరుతో నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నదన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తూ, ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత కేసిఆర్ ప్రభుత్వం లాగే విద్యారంగానికి అన్యాయం చేస్తున్నదన్నారు. బడ్జెట్లో ఆశించినంత నిధులు కేటాయించకుండా, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇబ్బంది పెడుతుందన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత, ప్రభుత్వ విద్య కోసం, అసమానతలు లేని నూతన సమాజం కోసం విద్యార్థులోకం పోరాడాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ మాట్లాడుతూ దోపిడీ,  పీడనలు లేని సమ సమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్య లక్ష్యంగా గత 50 ఏళ్లుగా పి.డి.ఎస్.యు రాజీలేని పోరు చేస్తుందన్నారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాతలు కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ల అమరత్వాన్ని ఎత్తి పెడుతూ వారి ఆశయాల బాటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పి.డి.ఎస్.యు పోరాడుతుందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన, సమానమైన విద్యను అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ఒక అంగడి సరుకుగా మార్చాయన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఒరవడితో ముందుకు సాగుదామని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ,  జార్జి రెడ్డి మిత్రులు పద్మారావు, సీఎల్సీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ , పి డి ఎస్ యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, నగర అధ్యక్ష కార్యదర్శులు నసీర్, వినోద్ లు మాట్లాడారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు నరేందర్, వెంకన్న, రాజేశ్వర్, గంగాధర్, మల్లేష్, అనిల్, సృజన్, వైష్ణవి, కార్తీక్, మనితేజ, సాయిబాబా, నాగేష్, రెహాన్, గణేష్, జ్ఞాప్తిక, మహేందర్, దీపిక , లావణ్య, రియాన్, వికాస్, రాకేష్, కిరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Modi government is saffronizing education