. . . సుదర్శన్ రెడ్డి గో బ్యాక్ నినాదాలతో బీఆర్‌ఎస్ ఆందోళన
బోధన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. గత రెండేళ్లుగా బోధన్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు “ఎమ్మెల్యే గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసనకు దిగిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ— బోధన్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. అందుకే కాన్వాయ్‌ను అడ్డుకున్నామని తెలిపారు. ఇకనైనా నియోజకవర్గానికి తగిన నిధులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
