Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2025, 5:50 pm Posted by : ramakrishna

మహాలక్ష్మి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ, బాన్సువాడ :తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమమే ధేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహాలక్ష్మి పథకం ద్వారా కల్పించారని, దీని కోసం ఇప్పటివరకు రూ. 6.680 కోట్లు కేటాయించారని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన మహాలక్ష్మి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేవలం ఆధార్ కార్డు ఉంటే మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని దీనివల్ల మహిళలకు ఎంతో సౌలభ్యం ఏర్పడిందని ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. ఒక్క బాన్సువాడ పరిధిలోనే సుమారు 1.63 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించారని దీనికోసం ప్రభుత్వం రూ. 62 కోట్లను చెల్లించిందని అన్నారు. ఈపథకం కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అమలవుతుందన్నారు. దీనితో పాటు ఉచిత విద్యుత్తు పథకం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే బీసీల కోసం పోరాడుతున్నారని కులగణన దేశంలోనే ప్రథమమని సంక్షేమ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డిపో మేనేజర్ సరితాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు , ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.