నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూర్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్‌ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవార సందర్శించారు.. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయో-మైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ చెత్తను తొలగించడానికి బయో-మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారన్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి, శుభ్రపరచి, భూమిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తారని తెలిపారు. మొదట చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి వాసనలు తగ్గిస్తారని, తర్వాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను మూడు భాగాలుగా వేరు చేస్తారని తెలిపారు. ఎరువుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం, ఫ్యాక్టరీల కోసం ఇంధనంగా ఉపయోగించే ఆర్ఢీఎఫ్, మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం 2 మిషిన్లు పనిచేస్తుండగా, అదనంగా మరో 2 మిషిన్లు అవసరం పడతాయి అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్యలతో ప్రాంతం శుభ్రపడి, నాగారం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు.
