Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 8:19 pm Posted by : ramakrishna

ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రజల అవసరాల కోసం ప్రతిపాదించిన ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్ & బి స్థలాన్ని గుర్తించి ప్రతిపదించామని, అలాగే బస్టాండ్ నిర్మాణము కోసం 20 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు అత్యవసరమైన రవాణా సదుపాయాలను పక్కనబెట్టి, పార్టీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ అసలు వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ కోసం ప్రత్యామ్నాయ స్థలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు చర్య అని అన్నారు. ఈ కేటాయింపుల వెనుక వాణిజ్య వ్యాపారా ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పార్టీ కార్యాలయం పేరు మీద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం అత్యవసరమని, ఆ స్థలంలో ప్రజలకు కావాల్సింది అత్యాధునిక ఆర్టీసీ బస్టాండ్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంప్లెక్స్ కాదని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆ స్థలాన్ని తిరిగి ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, వాటిని పార్టీ అవసరాలకు వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.