- మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మొండి చేయి
- క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం
- అజహారుద్దీన్ కు మంత్రి పదవితో షబ్బిర్ ఆలీ ఆశలకు గండి
- ఉమ్మడి జిల్లాకు అమాత్య పదవికి అడ్డంకిగా మారిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల అమాత్య పదవి ఆశలు గల్లంతయ్యాయి. గురువారం నాటి మంత్రి వర్గ విస్తరణలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్, ఎమ్మెల్సీ మహ్మద్ అజాహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీ అమాత్య పదవి ఆశలకు గండిపడింది. శుక్రవారం మంత్రి వర్గ ప్రమాణ స్వీకారంలో మరికొంత మంది పేరు వస్తుందని అందులో అజాహరుద్దీన్ తో పాటు బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చిందని చర్చ జరిగింది. శుక్రవారం గవర్నర్ ఒక్క అజాహరుద్ధిన్ తో మంత్రిగా (పోర్టు పోలియో) లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం, ప్రభుత్వం సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన సలహాదారు (క్యాబినేట్ హోదా) తో నియమిస్తు ఉత్తర్వులు జారీ చేయడం చక చకా జరిగిపోయాయి. దానితో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు అనేవి రావని తేట తెల్లమైంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని మంత్రి వర్యా అని పిలువకుండానే క్యాబినేట్ హోదాతో పాటు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించే అధికారం, క్యాబినేట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యే విధంగా ప్రధాన సలహాదారు పదవి దక్కడం ఒక్కటే ఊరట కలిగించే అంశం.

- ప్రభుత్వం పథకాల అమలుకు ప్రధాన సలహాదారునిగా క్యాబినేట్ హోదాతో సుధర్శన్ రెడ్డి నియామాకం..
బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుకోసం ప్రధాన సలహాదారుగా క్యాబినేట్ హోదాలో నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలు ఇప్పటి వరకు మంత్రి పదవిపై సుధర్శన్ రెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. కాని మంత్రి వర్గ కూర్పులో సామాజికవర్గాల సమీకరణలో సుధర్శన్ రెడ్డికి మంత్రి పదవికి దూరమయ్యారు. తొలుత సభాపతి పదవిని సుధర్శన్ రెడ్డికి ఆఫర్ చేసిన ఆయన సున్నితంగా తిరిస్కరించారు. చివరి సారిగా అమాత్య అని పిలిపించుకోవాలన్న ఆశ నేరవేరలేదు కాని క్యాబినేట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా మాత్రం నియమితులు అయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం సిరన్ పల్లికి చెందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1999, 2004,2009, 2023లో బోదన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినేట్ లలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాడు జలయగ్నంలో భాగంగా ప్రస్తుత కాళేశ్వరం (అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి) ప్యాకేజీ 21,22 పనులను చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటులో సుదర్శన్ రెడ్డికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 2023 కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. క్యాబినేట్ హోదాతో సుధర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమాకం కావడంతో హర్షం వ్యక్తమవుతుంది.
- ఉమ్మడి జిల్లా నేతలకు గుదిబండగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలకు మంత్రి పదవిని దూరం చేసింది. బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికల సమయంలో ఒక్క బీసీకి టికెట్ ఇవ్వకపోవడంతో అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా శాసన సభకు ఎంపిక కాలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఓసీలు, ఒక ఎస్సీ కావడం, తరువాత చేరిన పోచారానికి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మంత్రి వర్గ విస్థరణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంతో నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నుంచి అందరు అగ్రవర్ణ ఎమ్మెల్యేలు ఉండటంతో మూడు సార్లు జరిగిన మంత్రి వర్గ విస్థరణలో మొండిచేయి తప్పలేదు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖ, మాజీ మంత్రి షబ్బీర్ ఆలికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమల శాఖ ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. తాజాగా బోదన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ శాఖల ప్రధాన సలహదారుగా (క్యాబినేట్ హోదా) కలిగిన నియామకం చేయడంతో అమాత్య పదవుల ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నికలప్పుడే ఒక్క బీసీకి టికెట్ ఇచ్చిన, షబ్బిర్ ఆలీ గెలిచిన మంత్రి పదవి దక్కేదని చర్చ జరుగుతుంది.
- షబ్బీర్ ఆలీ మంత్రి పదవి ఆశలు వమ్ము..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మంత్రి పదవి ఆశలు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఓడినప్పటికి ప్రభుత్వం సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఐతే మైనార్టీలకు క్యాబినేట్ లో చోటు లేకపోవడంతో ఆకోటాలో మంత్రి పదవి ఆశించారు. తొలుత ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని తరువాత మంత్రి పదవి ఖాయం అని అనుచరులు చెప్పుకున్నారు. ఇటీవల అజాహారుద్దీన్ కు ఎమ్మెల్సీగా నియామకం మొదలుకొని శుక్రవారం ఏకంగా మంత్రిగా పదవి స్వీకార ప్రమాణం చేయడంతో షబ్బీర్ ఆలీ ఆశలకు గండిపడింది. ఇప్పటికే 8 సార్లు పోటీ చేసిన రెండు సార్లు మాత్రమే గెలువడం, ఆరు ఓటమీలు షబ్బీర్ ఆలీకి పదవులను దూరం చేశాయి. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో మైనార్టీ సీనియర్ లీడర్ గా చలామణి అవుతున్న షబ్బీర్ ఆలీ చరిష్మా తగ్గడం ప్రారంభమైంది.