- టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కనీస వేతనాల 5 జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు శనివారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కోటగల్లీలోని శ్రామిక భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక వర్గం కోటి మంది పైగా ఉన్నారని, పెరిగిపోతున్న ధరలతో చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారన్నారు. 2021లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం 5 కనీస వేతనాల జీవోలకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కనీస వేతనాల సలహా మండలిలోగల ప్రభుత్వం, యజమాన్య మరియు కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం జీవోలను ఫైనల్ చేశారని, అట్టి జీవోలను ప్రభుత్వము గెజిట్ చెయ్యాలన్నారు. (రాజ పత్రం ముద్రించాలి) కానీ 2021 జూన్లో విడుదల చేసిన జీవోలకు నేటికీ గెజిట్ ముద్రించకపోవడం సిగ్గుచేటైన విషయన్నారు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొందు దొందే అన్నట్టుగా పరిస్థితి అన్నారు. అదే విధంగా మరో 12 జీవోల ఫైనల్ నోటిఫికేషన్ను ప్రభుత్వానికి, ఆనాటి కనీస వేతనాల సలహా మండలి రికమండేషన్ చేసిందన్నారు. వాటికి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మిగిలిన 56 జీవోలను వాటి ప్రాతిపదికగా సవరించాల్సి ఉందన్నారు. కానీ అలాకాకుండా 2024 జనవరిలో రేవంత్ ప్రభుత్వం పాత 73 జీవోలకు నేటి కరువు భత్యము (వి.డి.ఎ.) కలుపుకొని ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఈ జీవోలలో కేవలం 13 నుంచి 14 వేల లోపు మాత్రమే వేతనాలను సవరించారన్నారు. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి, పి.సాయన్న తదితరులు పాల్గొన్నారు.