Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2024, 11:03 pm Posted by : ramakrishna

మిల్లర్ల మెలిక

  • 480కి 9 కేంద్రాలే ఏర్పాటు
  • దిగిన దళారులు
  • నష్టపోతున్న రైతులు

బతుకమ్మ, నిజామాబాద్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను నెలకొల్పడంలో అధికారులు తాత్సరం చేస్తున్నారు. మిల్లర్లు కొన్ని షరతులను ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిని అమలు చేస్తేనే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుతామని మెలిక పెట్టారు. దీనివల్ల కేంద్రాలు ఎక్కువగా నెలకొల్పితే వచ్చిన ధాన్యం నిలవ చేసేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని ముందుగా ప్రాంతాలవారిగా గోదాములను ఏర్పాటు చేసే పనిలో అధికారులు ఉన్నారు. చేతికొచ్చిన పంటను వర్ష భయంతో స్థానికంగా ఉన్న మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం అందించే ధర కన్నా తక్కువతోపాటు, క్వింటాలుకు సుమారు రెండున్నర కిలోలు తరుగును తీసిన తర్వాత ధాన్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. సకాలంలో కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

480కి 9 కేంద్రాలే…! : రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఐకేపి, పిఎసిఎస్, డిసిఎంఎస్, కేపిపిఎస్ఎస్ఎస్, మెప్మా సంస్థల తరఫున 480 కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం 9 కేంద్రాలనే తెరిచారు. అదీనూ వర్ని, రుద్రూర్, కోటగిరి ప్రాంతాలలోనే కొనుగోలు కేంద్రాలనునెలకొల్పారు. ఖరీఫ్ లోను, రబీలోను ఈ ప్రాంతాలలో ముందుగా సాగు చేస్తుండడంతో పంట తొందరగా చేతికి వస్తుంది. వీరి కోసం కేంద్రాలను ముందుగా తెరిపించారు.

దిగిన దళారులు : నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ లలో పంట నూర్పిడి జోరుగా సాగుతోంది. వీటికి అనుగుణంగా కేంద్రాలు లేక పోవడంతో దళారులు రైతుల చెంతకు చేరుతున్నారు. మిలర్లతో జత కూడిన దళారులు ప్రభుత్వం చెల్లించే ధరకన్నా తక్కువకు తీసుకుంటున్నారు. ధాన్యం కనబడిన చోటుకు వెళ్లి ఎన్ని రోజులని కేంద్రాల కోసం చూస్తారు, అకాల వర్షాలు పడితే పరిస్థితేంటి ..? అని రైతులతో మంతనాలు జరిపి పంటను విక్రయించేలా చేస్తున్నారు. దళారుల మాటలను వింటున్న రైతులు వెనుక ముందు ఆలోచించకుండా ధాన్యాన్ని అమ్మేస్తున్నారు.

నష్టపోతున్న రైతులు : వాతావరణం మేఘావృతంగా మారుతుండడంతో రైతులు వణుకుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురిస్తే ఆరుగాలం శ్రమతో పాటు పెట్టిన పెట్టుబడి రాకుండా పోతుందనే భయం అన్నదాతను వెన్నాడుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు స్థానికంగా ఉన్న మిల్లర్లకు, దళారులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు.