- ఐదేళ్లలో యేటా తగ్గు ముఖమే
- సొసైటీలను కలిసేందుకు ససేమిరా
- రైతులతో ముచ్చట శూన్యం
- వినాశన దిశగా ‘విజయ’ డెయిరీ
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ లో పాల ఉత్పత్తి రోజు రోజుకి పడిపోతుంది. గత ఐదేళ్ల నుంచి దారుణమైన పరిస్థితి డెయిరీలో చోటు చేసుకుంటుంది. ఉత్పత్తిని పెంచడం కోసం సొసైటీలను కలవడానికి డెయిరీ అధికారులు ససేమిరా అంటున్నారు. కనీసం పాడి రైతులతో ముచ్చటించేందుకు సైతం మూతి తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. డెయిరీని వినాశన దిశగా నడిపిస్తున్న అధికారి బదిలీని నిలిపి వేయించుకొని ఇక్కడే ఉండిపోయాడు.
- యేటా తగ్గుముఖం….
నిజామాబాదులోని సారంగాపూర్ లో గల డెయిరీ ప్రధాన కేంద్రానికి వచ్చే పాలు యేటా తగ్గుతోంది. ఉత్పత్తి పెరగద్దు..అమ్మకాలు జరగొద్దు అనే నినాదంతో డెయిరీ మేనేజర్ పనిచేస్తున్నట్లు కనబడుతోంది. కేంద్రంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా, చెప్పుకునేందుకు సాధించిన ఘనకార్యాలు ఏమి లేక పోవడం ఆయన పని తీరుకు నిదర్శనం. ఈ అధికారి నిర్వాకం వల్ల కేంద్రానికి తీసుకువచ్చే పాలు క్రమేణా తగ్గుతున్నాయని సిబ్బందితోపాటు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో ధర్పల్లి బిఎంసి నుంచి సుమారు 1042 లీటర్లు, నవీపేట్ లో 740, బోధన్ లో 821, కోటగిరి లో 1547 లీటర్ల పాలను సేకరిస్తున్నారని సమాచారం. ఐదేళ్ళ నుంచి ఐదు వేల లీటర్లు పాలు డెయిరీకి వచ్చిన పాపాన పోలేదనే వాస్తవాలు కోడై కూస్తున్నాయి.
- కలిసేందుకు ససేమిరా…
జిల్లా వ్యాప్తంగా పాడి రైతులకు సంబంధించి 119 సొసైటీలను ఏర్పాటు చేసారు. వీరంతా గతంలో విజయ డెయిరీకి అనుకూలంగా ఉంటూ, పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేశారు. ప్రస్తుత అధికారి డెయిరీకి అనుబంధంగా ఉన్న వాటిల్లోంచి ఏ ఒక్క సొసైటీని ఐదేళ్లలో కలవలేదని రైతులే బాహాటంగా విమర్శిస్తున్నారు. గత కొంత కాలంగా ఆలూరు గ్రామంలోని ఒక సంఘ భవనంలో బిఎంసి ఉండేది. భవనాన్ని పునఃనిర్మాణం చేపడతామని ఇందులో ఉన్న పాల కేంద్రాన్ని మరో చోట నెలకొల్పాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంచే విధంగా అదే గ్రామంలో మరో చోట ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎప్పుడెప్పుడు తొలగిద్దామా అని వేచి చూసిన డెయిరీ అధికారి ఇదే ఆధనుగా సారంగాపూర్ కు తరలించి చీకటి గదిలో పెట్టించారు. వాడకం లేకపోతే చెడిపోతుందని పక్క జిల్లాలోని భైంసా కు పంపించినట్లు తెలిసింది. రైతులకు, డెయిరీకి ఉపయుక్తంగా ఉన్న ఆలూర్, వర్ని గ్రామాల్లోని కేంద్రాలను తరలించి పని లేకుండా చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- రైతులతో ముచ్చట శూన్యమే..
ఒకప్పుడు రైతులతో కళకళలాడిన సారంగాపూర్ విజయ డెయిరీ, ప్రస్తుతం అదికారుల నిర్వాకం వల్ల బోసిపోతుంది. విత్తనాలు, మినరల్ మిక్సర్, సమస్యలు తెలియజేసేందుకు, సమావేశాలకని కార్యాలయం దూరమైన ఏదో పని మీద డెయిరీకి వచ్చేవారు. అందులోని సిబ్బంది మినహా రైతుల ఉనికి కేంద్రంలో ఐదేళ్లుగా కనబడడం లేదని రైతులు ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. గ్రామాలలో పాడి రైతులను ముఖాముఖీగా కలిస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో
- వినాశన దిశగా….
పాడి రైతులను ప్రోత్సాహస్తూ డెయిరీని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాల్సిన అధికారి, వినాశనం దిశగా తీసుకెళ్తున్నాడనే ప్రచారం డెయిరీలో జరుగుతోంది. ఈ ఐదేళ్ళ నుంచి పాల ఉత్పత్తి పెంచలేక, అమ్మలేక పోవడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. అంతంతమాత్రంగా నడుస్తున్న డెయిరీని పూర్తిగా నష్టాల్లోకి నెట్టివేసేందుకు, బదిలీ అయినా పైరవితో నిలిపివేయించుకొని ఇక్కడే ఉండిపోవడాన్ని చూస్తే నిజమే కావొచ్చు అనే అభిప్రాయాలు విభిన్న వర్గాల నుంచి వెలువడుతున్నాయి. డెయిరీ అధికారి పని తీరును బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చైర్మన్ అమిత్ రెడ్డి లోతుగా పరిశీలించి, బదిలీ చేస్తేనే సంస్థను కాపాడినవారు అవుతారని రైతులు విశ్వసిస్తున్నారు.