Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 3:29 pm Posted by : ramakrishna

అర్ధరాత్రి ఇసుక అక్రమ దందా

  • పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు

 

బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా పోతుంది. హస్గుల్, శెట్లూర్,పుల్కల్ ,ఖాత్గవ్ గ్రామాలలో మంజీరా నది నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి  కర్ణాటక, మహారాష్ట్ర లాంటి  ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం అక్రమ ఇసుక వ్యాపారులకు ఇసుక దందా కాసుల వర్షం కురిపిస్తోంది. చట్ట ప్రకారం.. వాహనాలను జప్తు చేయడంతో పాటు జరిమానా విధించాలి. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసే నాథుడే కరువయ్యాడు. ఇసుక రవాణాను అరికట్టాల్సిన అధికారులు వాహనానికి ఇంతా అంటూ మాముళ్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో కొందరు రాటుదేలి ఈ వ్యాపారాన్ని ఉపాధిగా చేసుకొని దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద మండల కేంద్రం మీదుగా నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందాను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు పట్టనట్టు వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

 

బతుకమ్మ: బిచ్కుంద : ఇసుక అక్రమ రవాణాకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని అమలు చేస్తున్నారు అక్రమార్కులు. ధనార్జనే ధ్యేయంగా మంజీరా నది నుంచి ఇసుకను తోడి అడ్డదారిన జీరో దందాను సాగిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అడపాదడపా పోలీసులకు చిక్కుతున్నా.. వ్యూహాలు మార్చి దందా సాగిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది. బిచ్కుంద మండలం లో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుంది.  హస్గుల్, శెట్లూర్,పల్కల్ ,ఖాత్గావ్ గ్రామాలలో మంజీరా నది నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా మండలానికి చెందిన నాయకులు, వ్యక్తులతో పాటు స్థానికులు కొందరు ముఠాగా ఏర్పడిన సమీప వాగులు, మంజీరా నది నుంచి రాత్రిపూట జేసీబి సహాయంతో దర్జాగా ఇసుకను తవ్వి సదరు అక్రమార్కులు సమీప ప్రాంతాలలో భారీ మొత్తంలో ఇసుక ట్రాక్టర్లలో మధ్యాహ్నం డంపు చేసుకొని రాత్రిపూట జంప్ చేస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత ట్రాక్టర్ల ద్వారా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలించుకు పోతున్నారు.

  • సమాచారం ఇస్తేనే దాడులు, తనిఖీలు..

ఇసుక అక్రమ రవాణా పై అధికారులకు సమాచారం ఇస్తేనే దాడులు, తనిఖీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  గతంలో హస్గుల్ నుంచి హైదరాబాదుకు తరలిస్తున్న 4 ఇసుక లారీలు, మూడు ట్రాక్టర్లను రెవిన్యూ, పోలీస్ అధికారులు పట్టుకున్నారు. అలాగే హస్గుల్ గ్రామంలో నిల్వ ఉన్న 35 ట్రాక్టర్ల ఇసుక డంపులను రెవెన్యూ, పోలీసులు అధికారులు సీజ్ చేశారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసి.. పేపర్ ప్రకటనల కోసం తూతూ మంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేసి, వదిలేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో అక్రమార్కులకు షరా మామూలుగా మారింది. సీజ్ చేసిన ఇసుక డంపులను కొన్నాళ్లకు అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు ఉంది. మరోపక్క అధికారుల అండదండలతోనే ఇసుక దందా కొనసాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా మండలంలో అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

Midnight sand raid