Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 6:13 pm Posted by : ramakrishna

మెసెంజర్ సంజీవ్ కుటుంబాన్ని ఆదుకోవాలి

. . . సమ్మె విరమణ హామీలను తక్షణమే నెరవేర్చాలి

 

. . . నిజామాబాద్ తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం హెచ్చరిక

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇటీవల మండల విద్యా వనరుల కేంద్రం  మాక్లూర్ లో విధులు నిర్వహిస్తూ మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగి మెసెంజర్ సంజీవ్ కుటుంబానికి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం సంజీవ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కె. రాజు మాట్లాడుతూ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం అమానుషమన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం ఉద్యోగుల సహనానికి పరీక్షగా మారిందని అన్నారు. ఇప్పటివరకు సుమారుగా 200 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు మరణించినప్పటికీ ఒక్కరికీ కూడా ఎక్స్ గ్రేషియా చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సంజీవ్ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకుని తగిన ఎక్స్ గ్రేషియా మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపేందర్‌తో పాటు సంఘ నాయకులు అంబదాసరావు, అప్సర్, గోపాల్, సామ్యూల్,  సాయికుమార్, బాబు, స్రవంతి, మోహన్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.