నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
హెల్త్ సెంటర్, తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యo పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు విద్యా, పోటీ పరీక్షలు కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటి ద్వారా వత్తిడికి గురికాకుండా మానసిక ధైర్యంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఒత్తిడులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో గౌరవంగా స్థిరపడాలని సూచించారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జి డా. గోపిరాజు మాట్లాడుతూనేటి సమాజంలో విద్యార్థులు చదువు ఒత్తిడి, పోటీ భావం, కుటుంబ సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన వంటి అనేక ఒత్తిడులను అధిగమించడానికి వారికి మానసిక ధైర్యాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని తెలియజేశారు. క్లిష్టమైన సమయాలలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మిత్రుల నుండి సరియైన సలహాలు తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. భావాలను స్వేచ్ఛగా ఇతరులతో పంచుకోవడం ముఖ్యంగా తల్లిదండ్రులతో చర్చించడం ద్వారా అన్ని రకాల ఒత్తిడి లను అధిగమించవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.