Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 7:48 pm Posted by : ramakrishna

సభ్యత్వ నమోదును ఉద్యమంలా నిర్వహించాలి  

 

. . . సార్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలి

 

. . . త్వరలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం లో కూడా శ్రద్ధతో పాల్గొనాలి

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు అనేది కేవలం సంఖ్యలను పెంచే కార్యక్రమం కాదని, పార్టీతో ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతి బూత్ ఇంచార్జ్ తన పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సంప్రదించి పార్టీ సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సార్  కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు హక్కును కాపాడే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు చూపించిన ఆశలు నేటికీ నెరవేరలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజలు నిత్యం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన పాలకులు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేరని హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.

 

Membership registration should be organized as a movement.

 

ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న సార్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లు, బూత్ ఇంచార్జులు అత్యంత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఓటరు జాబితాల్లో ఎలాంటి లోపాలు, పొరపాట్లు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కోరారు. త్వరలో ప్రారంభం కానున్న బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సభ్యత్వ నమోదును ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని గణేష్ బిగాల విమర్శించారు. ఎన్నికల సమయంలో అభివృద్ధి పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. నగర అభివృద్ధిని పక్కనపెట్టి నిజామాబాద్‌ను సమస్యలతో నిండిన నగరంగా మార్చారని అన్నారు. రోడ్లు, పారిశుధ్యం, మౌలిక వసతులు, ప్రజా అవసరాల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని పేర్కొంటూ, అలాంటి వ్యాఖ్యలను వెంటనే విరమించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కూడా గణేష్ బిగాల ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికలకు సంవత్సరం ముందు హామీల అమలు పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను, ప్రజలకు ప్రకటించిన “420 హామీలను” వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజా సమస్యలు, నెరవేరని హామీల గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

Membership registration should be organized as a movement.

 

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో పార్టీ బూత్ ఇంచార్జులు, నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించబడకుండా జాగ్రత్త పడాలని, ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో సమానమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజలకు వివరించాలని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటిని సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేలా పనిచేయాలని అన్నారు.

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ… బూత్ కమిటీలు బలంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని అన్నారు. ప్రతి బూత్ ఇంచార్జ్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్సీ వి.జి. గౌడ్ మాట్లాడుతూ… ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఓటరు జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

 

Membership registration should be organized as a movement.

 

కరీంనగర్ నగర మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని ప్రజలకు గుర్తు చేస్తూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదే బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే బీఆర్ఎస్ కు నిజమైన బలం అని పేర్కొంటూ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్ డివిజన్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Membership registration should be organized as a movement.