. . . మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులపై చర్చ
. . . రైల్వే బ్రిడ్జిలకు నిధుల మంజూరుకు సీఎం అంగీకారం
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి సమీక్షించారు.ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని నేతలు వివరించారు. నేతల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. సీఎంను సమావేశమైన వారిలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నాయకులు మానాల మోహన్ రెడ్డి, వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి, తదితరులున్నారు.