Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 9:08 pm Posted by : ramakrishna

మానవాళికి మధ్యవర్థితం మేలు

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల

బతుకమ్మ, నిజామాబాద్ : మానవ సమాజంలో మనుషుల మధ్య ఉన్న అన్ని సమస్యలకు మధ్యవర్థిత్వమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి జిల్లాకోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవ సధన్ లో మధ్యవర్థిత్వ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సామాజిక వర్గాలుగా కొన్ని మధ్యవర్థిత్వ కేంద్రాలు ఉన్నాయని ,కాని నేటి కేంద్రం అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రజల మధ్య ఉన్న సమస్యలు ఒక పరిష్కానికి తీసుకురావడంలో మధ్యవర్థిత్వ కేంద్రాలు సమర్థవంతంగా విధులు నిర్వహించగలవని ఆమె అన్నారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్ లు సంపూర్ణ సహాయ,సహకారాలు అందిస్తున్నారని ప్రశంసించారు. సెప్టెంబర్ 28 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కు న్యాయవాదులు,న్యాయార్థులు సహకరించి ,విజయవంతానికి కృషి చేయాలని ఆమె కోరారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రసంగిస్తూ మానవ సమూహాలలో నెలకొన్న ఆర్థిక,సామాజిక సమస్యలకు పరిష్కార వేదికలుగా మధ్యవర్థిత్వ కేంద్రాలు ఉపయోగ పడతాయని అన్నారు. మధ్యవర్థిత్వానికి ప్రాచీన చరిత్ర ఉన్నదని తెలిపారు.కొన్ని రకాల సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కారాలు లభిస్తాయని ఆయన తెలిపారు.జిల్లా ప్రజలు మధ్యవర్థిత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని అన్నారు. చిన్న, చిన్న సమస్యలు పోలీస్ స్టేషన్ వరకు పోరాదని, అవి వ్యక్తుల మధ్యనే ,లేదా పెద్దల మధ్యనే పరిష్కారమైతే సమాజానికి గొప్ప సందేశం, విలువలు నేర్పిన వారం కాగలమని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయసేవ సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ రంగు వెంకట పురుషోతo గౌడ్, పారాలీగల్ వాలంటీర్స్, న్యాయవాదులు పాల్గొన్నారు.