Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:57 pm Posted by : ramakrishna

ముఖ్యమంత్రి పర్యటనకు మేడారం ముస్తాబు

 

. . . ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి

 

. . . మేడారం ఆలయ తుది దశ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

 

. . . సమ్మక్క – సారలమ్మ సన్నిధి నుంచి ఒంటరి, వితంతు మహిళల పింఛన్లకు శ్రీకారం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సమ్మక్క – సారలమ్మ వనదేవతల సన్నిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి పరిశీలించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు మేడారం ప్రాంగణాన్ని సందర్శించి సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు మహాజాతరకు ముందు కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారంలో బస చేసి, ములుగు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించారని చెప్పారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి మరోసారి మేడారానికి రానున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన విస్తరణ, అభివృద్ధి పనులపై సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, మార్గదర్శకత్వానికి అనుగుణంగా మేడారాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీతక్క వెల్లడించారు. మేడారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ములుగు జిల్లా, నియోజకవర్గ ప్రజల తరఫున పేరుపేరునా స్వాగతం పలుకుతున్నామని మంత్రి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి మేడారం ఆలయ ప్రాంగణంలో పర్యటించనున్న నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

 

Medaram decked up for Chief Minister's visit.