Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 9:09 pm Posted by : ramakrishna

చరిత్రకు చిరునామాగా… ప్రకృతికి నిలయంగా మెదక్

 

. . . ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌తో మెదక్‌కు కొత్త గుర్తింపు

 

. . . కలెక్టర్ ప్రతిమా సింగ్

 

మెదక్, బతుకమ్మ :

 

చారిత్రక వారసత్వం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలను సమన్వయం చేస్తూ మెదక్ జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోచారం అభయారణ్యంలో నిర్వహించిన క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు నిజాం పాలనలో వేట కేంద్రంగా పేరుగాంచిన షికార్ ఘర్, పోచారం అభయారణ్యం, జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

 

Medak, the home of history... the home of nature

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు, పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ చొరవ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి వేగం పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మెదక్ కోట, మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, పోచారం అభయారణ్యం, నిజాం షికార్ ఘర్ వంటి చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక కేంద్రాలను ఒకే టూరిజం సర్క్యూట్‌గా అనుసంధానించి దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పర్యాటకులకు మెరుగైన వసతులు, రహదారి అనుసంధానం, సమాచార కేంద్రాలు, క్యాంపింగ్, ఎకో-టూరిజం కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలను ప్రోత్సహిస్తూ మెదక్‌ను తెలంగాణలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, పర్యాటకులు పాల్గొన్నారు. మెదక్ మట్టి మహిమను దేశవ్యాప్తంగా చాటే దిశగా జిల్లా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలితాలను అందిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Medak, the home of history... the home of nature