. . . డాక్టర్ లు లేకుండానే ఆసుపత్రుల ఏర్పాటు
. . . మేనేజ్ మెంట్ చెప్పిందే వైద్యం
. . . నిజామాబాద్ లో నయా కల్చర్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అద్దెకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు దొరుకుతున్నాయి. ఇదేమిటి కొత్త కల్చర్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది వరకు మెడికల్ ల ఏర్పాటు కోసం డీ ఫార్మసి, బీ ఫార్మసి సర్టిఫికెట్లను అద్దెతో నడుస్తున్న విషయం తెల్సిందే. చాలా మట్టుకు మెడికల్ లకు పొత్తు (పార్టనర్ షిప్ డీడ్) ద్వారా ఎలాంటి విషయం తెలియని వారు మెడికల్ లను నిర్వహిస్తున్నారు. అందుకు సవాలక్ష కారణాలు ఉన్న విషయం తెల్సిందే. డాక్టర్లు చాలా మంది తమ సంబంధీకులతో మెడికల్ లను ఏర్పాటు చేసేందుకు అద్దెకు ఫార్మసి సర్టిఫికెట్లను తీసుకునే కల్చర్ దశాబ్ధాలుగా ఉన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే ఇటీవల కాలంలో ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని హాస్పిటల్ లను ఏర్పాటు చేస్తున్న కల్చర్ నిజామాబాద్ ను ముంచేత్తుతోంది. డాక్టర్ల కాలనీగా పేరు గాంచిన నిజామాబాద్ నగరంలోనే డాక్టర్లు లేకుండానే క్లినిక్ లు, నర్సింగ్ హోంలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు పుట్టుకొచ్చాయి. కేవలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి సమయంలోనే ఎంబీబీఎస్ డాక్టర్ పేరు మీద పర్మిషన్ తీసుకుని వారు లేకుండానే హాస్పిటళ్ళను నడిపించే మేనేజ్ మెంట్ వ్యవస్థ రూపుదిద్దుకుంది.

నిజామాబాద్ జిల్లాలో మెడికల్ వ్యవస్థ అంటేనే రాష్ట్రంలోనే పేరు గాంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం ఖర్చుకు వెనుకాడని కల్చర్ కేవలం నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్, కరీంనగర్ తర్వాత అతిపెద్ద మెడికల్ హబ్ అంటే నిజామాబాద్ పేరు చెబుతారు. ఇక్కడ ప్రధానంగా న్యూరో, కార్డియో, ఫిజిషియన్, జనరల్ సర్జన్ లకు ఉన్నంత డిమాండ్ మరెక్కడా లేదు. నిజామాబాద్ జిల్లాకు సంబంధం లేని డాక్టర్లను పీజీలు చేయగానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసిన వారిని లక్షలకు లక్షలు చెల్లించి నిజామాబాద్ రప్పించి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వారి ద్వారా జరిగే వైద్యం విషయంలో ఎవరికి ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను ముందుంచి పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ లను ఏర్పాటు చేసే కల్చర్ కొన్ని రోజులుగా జోరుగా జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, నందిపేట్, బాన్సువాడ, కామారెడ్డి, గాంధారి, ధర్పల్లి, ఇందల్వాయి, వర్ని ప్రాంతాల్లో అద్దె ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో ఆసుపత్రులను నడుపుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కేవలం అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలన తప్పించి సంబంధిత వైద్యుడు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడా అనే విషయాన్ని పట్టించుకోకపోవడం ప్రైవేట్ మేనేజ్ మెంట్ వ్యక్తులకు వరంగా మారింది. వారు అద్దె ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో ఆసుపత్రులను ఏర్పాటు చేసి రోగులను పట్టి పీడిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఆర్డీవో ఆఫీస్ ఎదురుగా, ద్వారక్ నగర్ చౌరస్తా, ఖలీల్ వాడి చౌరస్తా, సరస్వతినగర్, శ్రీనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు చాలా మట్టుకు అద్దె ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతోనే ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. వారు డాక్టర్లకు నెలవారీగా జీతాలతో నడుపడం వారికే చెల్లింది. జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు మేనేజ్ మెంట్ చెప్పిన విధంగా రోగికి అవసరం లేకున్నా ల్యాబ్ టెస్టులు, స్కానింగ్ లు, మెడిసిన్ మందులు రాయడం వారి విధిగా మారింది. దానితో రోగులకు ఇబ్బందిగా మారింది. అద్దె ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారు కోట్లకు పడగలెత్తుతుంటే అందులో వైద్యం తీసుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవసరం లేకున్నా అక్కర రాకున్నా రోగుల నుంచి అందిన కాడికి దండుకునేందుకు చేస్తున్న వైద్యం దారుణంగా తయారైంది. ప్రధానంగా కొందరు గ్రామీణ వైద్యుల ద్వారా రిఫరెన్స్ పేరిట ఫిఫ్టి ఫిప్టిగా జరుగుతున్న వైద్యం పేదలకు చేటుగా మారింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అద్దె ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై నజర్ వేయకపోతే పేదలకు జరుగుతున్న అన్యాయం వెలుగులోకి వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది.
