. . . గుమస్తా కాలనీలో ఘనంగా దుర్గమ్మ బోనాల మహోత్సవం
. . . ఆలయ అధ్యక్షులు ఆమంద్ విజయ్ కృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, ఐక్యత, సేవాభావాలను పెంపొందిస్తుందని, జగజ్జనని దుర్గమ్మ తల్లి కరుణాకటాక్షాలు ఇందూరు నగర ప్రజలందరిపై, గుమస్తా కాలనీ వాసులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నామని ఆలయ అధ్యక్షులు ఆమంద్ విజయ్ కృష్ణ తెలిపారు. నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గమ్మ బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ఆర్యన్ తివారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. యువత, చిన్నారులు, కాలనీ వాసులు భారీగా పాల్గొనగా, డప్పు వాయిద్యాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గుమస్తా కాలనీ ప్రజలు ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో బోనాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో ఇందూరు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, యువత మంచి మార్గంలో పయనించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, వ్యాపారులు అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి బోడికే బాబురావు, కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ, ఉపాధ్యక్షులు మాడూరి కిషన్, శ్రీకరి సంతోష్, గంగోనే అనిల్, కార్యదర్శి ఆమంద్ వెంకట్, చోటే రాజేష్, సలహాదారులు ధాత్రిక రాజేందర్, కార్యవర్గ సభ్యులు గంగోనే సంతోష్, మెడికల్ శ్రీనివాస్, ధాత్రిక ప్రవీణ్, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పొందారు.
