. . . పద్మశాలీలతో 30 సంవత్సరాల అనుబంధం
. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని పద్మశాలీ కులస్తుల ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పద్మశాలీలతో తమ బంధం ఇప్పటిది కాదని గత 30 సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తాము ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి సందర్భంగా విచ్చేయడం జరుగుతుందని, తనకు మార్కండేయ జయంతికి రావడం అనేది మార్కండేయుని ఆశీర్వాదం బలంగా ఉండటమే కారణమని, అదే ఆశీర్వాదంతో పద్మశాలీల ప్రేమ అభిమానం తో కలిసి అడుగులు వేస్తున్నాం కాబట్టి అనుకున్నది సాధించగలుగుతున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం కడుతున్న భవనం పద్దతి ప్రకారం అన్ని సదుపాయాలతో నిర్మించుకోవాలని ఆయన కుల పెద్దలకు సూచించారు. మార్కండేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా పద్మశాలి పట్టణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి మహిళలు కలశాలు తీసుకొని వచ్చి మార్కండేయ మందిరం నుండి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి లింగాభిషేకం నిర్వహించిన అనంతరం ధ్వజారోహణ, నూతన వస్త్రాలంకరణ, అన్న పూజ, తీర్థ ప్రసాద వితరణ, పంచామృత అభిషేకం, మార్కండేయ డోలారోహణ, మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, గూడ శ్రీనివాస్, గుండాల బాలకృష్ణ, జీవన్, నందల రామచందర్,లక్క శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు అధ్యక్షురాలు ఏర్ల విజయలక్ష్మి, కార్యదర్శి బిజ్జి లత, ఉపాధ్యక్షురాలు సీమ, కోశాధికారి రేఖ తదితరులు పాల్గొన్నారు.
