Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 12:38 pm Posted by : ramakrishna

ట్రాప్ చేసి గంజాయి ముఠా అరెస్టు

. గంజాయి కొనుగోలు చేస్తామని నమ్మించి పట్టుకున్న వైనం

. చాకచక్యంగా  ఐదుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల పట్టివేత

. 32 కిలోల గంజాయి, కారు, రెండు బైక్ లు స్వాధీనం

నిజామాబాద్, బతుకమ్మ : గంజాయి ముఠాను ఎక్సైజ్ పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. అంతర్ రాష్ర్ట స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో వారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. స్థానికంగా అయూబ్ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుసుకుని తమకు గంజాయి అవసరం ఉందని సాధారణ పౌరుల్లా అతడిని సంప్రదించారు.

అయూబ్ రెండు రోజుల క్రితం గంజాయి తీసుకుని అర్సపల్లి వద్దకు రాగానే అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి ద్వారా మహారాష్ట్రలోని బోకర్ కు చెందిన ఫారూఖ్ ఖురేషి, షేక్ ఫహీం, షేక్ సిద్దిక్, జుబేర్ ఫఠాన్ ను అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి 32 కిలోల గంజాయితోపాటు కారు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

మరో కీలక సూత్రధారి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు చిక్కకుండా గంజాయి స్మగ్లర్లు ముందుగా వాహనాల్లో రెక్కీ నిర్వహించి కారులో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. గంజాయి దందా లో తలపండిన వారి కోసం ఎక్సైజ్ అధికారుల వేట కొనసాగుతోంది. గంజాయి కి చాలా డిమాండ్ ఉండడంతో చిన్నచిన్న ప్యాకెట్లలో అమ్ముతూ విద్యార్థులను, యువతను వ్యసనపరులుగా మారుస్తున్నారు.