- గ్రామాలకు పాకిన గంజాయి భూతం
- గంజాయి మత్తుకు బానిసలు అవుతున్న యువత
రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకింది. రుద్రూర్ మండల కేంద్రంలో చెరువు కట్ట ప్రాంతంలో, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో, జేయన్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తున్నట్లు, పేకాట ఆడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు పట్టణాల నుండి గంజాయి ప్యాకేట్లను తీసుకువచ్చి రుద్రూర్ లో ఎవరికంట పడకుండా చాప కింద నీరులా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరుల పై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
- గంజాయి మత్తుకు బానిసలు అవుతున్న యువత…
గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు అవుతున్నారు. గంజాయి సేవించే వారిలో ఎక్కువగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారు కావడం విశేషం. చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. గంజాయి వాడకం అనంతరం గ్రూపులుగా ఏర్పడి గొడవలకు దిగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో మిర్యాలగూడ పట్టణంలో గంజాయి సేవించిన యువకులు వీధుల్లో గొడవలకు దిగి వీరవిహారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత జైలు పాలవుతున్నారు. ఇప్పటకైనా సంబంధిత శాఖ అధికారులు యువత పై నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు.
