నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
మార్కెట్ లో అలా తిరిగి వద్దాం రమ్మంటే రానందుకు చాంద్ పాషా ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరచిన షేక్ సలీమ్ కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పు చెప్పారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. చాంద్ పాషా, షేక్ సలీమ్ ఇద్దరు నవీపేట్ గ్రామ నివాసులు. 28 ఏప్రిల్, 2025 న రాత్రి సమయంలో మార్కెట్ లో అలా తిరిగి వద్దాం అని పాషా ను అడిగాడు సలీమ్. అందుకు తనకు వేరే పని ఉందని రాలేనని తెలిపారు. నేను రమ్మంటే రానంటావా అంటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పాషా గుండె కింద పొడిచి హత్యయత్నం చేశాడని నవీపేట్ పోలీసులు కోర్టులో అభియోగ దాఖలు. నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల సాక్ష్యాలను నమోదు చేసిన కోర్టు సాక్ష్యధారాల ప్రకారం ముద్దాయి సలీమ్ పై హత్యయత్నం నేరం రుజువు కాలేదని కాని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరచిన నేరం రుజువు అయినట్లు సెషన్స్ కోర్టు నిర్దారించింది. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 118(1) ప్రమాదకరమైన ఆయుధంతో తీవ్రంగా గాయపరచినందుకుగాను మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించినట్లు పిపి రాజేష్వర్ రెడ్డి తెలిపారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు నెలలు జైలుశిక్ష అనుభవించాలని సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో రాశారని పిపి పేర్కొన్నారు.