Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 11:01 pm Posted by : ramakrishna

మల్కాపూర్ గుట్టను పొతం  పట్టిండ్రు

  •  రూరల్ మండలం మొరం నవీపేట్ కు తరలింపు
  •  ఇండస్ట్రీయల్ కారిడార్ లో అడ్డగోలు తవ్వకాలు
  •  రాత్రయిందంటే టిప్పర్ల హోరు
  •   ధ్వంసమౌతున్న గ్రామీణ  రోడ్లు 

నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ శివారులో గుట్టలను మొరం మాఫియా చెరబట్టింది. స్థానికంగా గుండారంకు చెందిన వారు మల్కాపూర్ కు చెందిన మరికొందరు కలిసి మల్కాపూర్ గుట్టలకు ఎసరుపెట్టారు. మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ద అనంత పద్మనాభస్వామి ఆలయం  ప్రక్కన ఉన్న గుట్టను రాత్రి, పగలు తొలిచేస్తున్నారు. 200 జేసీబీలతో కుల్లబొడుస్తున్నారు. స్థానికంగా గ్రామస్తులకు తాగునీరు అందించే మిషన్ భగీరథ ట్యాంక్ చెంతనే తవ్వకాలు చేయడం విశేషం. నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ పరిధిలో మొరం తవ్వకాలకు వే బిల్లులను తీసుకుని నవీపేట్ మండలానికి అక్రమంగా మొరం తరలిస్తున్నారు.

Malkapur Guttanu Potam Pattindru

నవీపేట్ మండలంలోని అనంతగిరి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న గోదాములకు వందలాది టిప్పర్లను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 3 వేలకు పైగా టిప్పర్లతో మొరంను తరలించినట్లు అంచనా ఉంది. అనంతగిరితో పాటు అబ్బాపూర్ చౌరస్తాలోని ప్రైవేట్ వెంచర్ కు  కూడా మొరం తరలించడం వారికే   చెల్లింది.రెవెన్యూ అధికారులు వే బిల్లులు ఇస్తున్నామని చెబుతున్నారు  కానీ వాటి వినియోగం ఎక్కడ జరుగుతుందోనని ఎవరూ పట్టించుకోవడం  లేదు. మల్కాపూర్ గుట్టలను పోతంపెట్టిన మొరం మాఫియా అది చాలదన్నట్లు ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం కేటాయించిన భూముల్లో మొరం తవ్వకాలు చేపట్టింది. అంతేగాకుండా ప్రస్తుతం గుండారం గుట్టల్లో మొరం మాఫియా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఏకంగా గుట్టపై మిషన్ లతో పట్టపగలే తవ్వకాలు మొరంను తరలిస్తున్నారు. మొరం మాఫియా కేవలం గ్రామ అవసరాల పేరుతో తవ్వకాలు చేస్తునే నిజామాబాద్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

Malkapur Guttanu Potam Pattindru

రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారుల అండతో మొరం మాఫియా రెచ్చిపోతుంది. మొరంను తవ్వకాలకు గ్రామస్తులతో పాటు అధికార  పార్టీ లీడర్లు తోడవ్వడంతో నిత్యం వందల ట్రిప్పుల మొరం తరలిపోతుంది. అధికార  పార్టీ నేతకు వారానికి లక్ష మామూళ్ళు ఇస్తున్నామని మొరం మాఫియా బహిరంగంగా చెబుతుంది. ప్రధానంగా గుండారం, మల్కాపూర్ ప్రాంతాలకు చెందిన మొరం మాఫియా లీడర్లు బెదిరింపులకు దిగుతున్నారు. మొరంను తవ్వకాలు చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఆరు నెలలుగా మొరం తవ్వకాలు జరుగుతూ రవాణా అవుతుండడంతో మల్కాపూర్ గుట్టలోని ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం వేసిన రోడ్లు ధ్వంసమయ్యాయి. మల్కాపూర్ నుంచి గుండారం వరకు ఉన్న రోడ్డు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి నవీపేట్ రోడ్డులో కొనసాగుతుంది.

Malkapur Guttanu Potam Pattindru