Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 8:53 pm Posted by : ramakrishna

మల్కాపూర్ (ఏ) గుట్టమాయం

. . . ఆరు నెలల్లోనే ఖతం చేసిన గొడ్డళ్ళ ఘనుడు

. . . గొడ్డళ్ళ వెనుక జీవోల ఘనుడు

. . . మొరం క్వారీలో 30 శాతం వసూళ్ళు ఎవరి ఖాతాలో?

నిజామాబాద్, బతుకమ్మ :   

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ రూరల్ మండలం చివరి గ్రామమైన మల్కాపూర్(ఏ) శివారులో గల గుట్ట ఆరు నెలల్లోనే మాయం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో జాన్కంపేట్, మల్కాపూర్ గ్రామాలకు చెందిన దళితులకు వెనుకబడిన సామాజిక వర్గాల వారికి సాగు కోసం కేటాయించిన అసైన్డ్ భూమిలో తవ్వకాలు చేసి గుట్టను మాయం చేశారు. జిల్లా కేంద్రానికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూమిపై కన్నుపడగానే మల్కాపూర్ కు చెందిన గొడ్డళ్ళకు లక్ష్మాపూర్ కు చెందిన మరో నేత తోడయ్యారు. దానితో గుట్టను కరిగించేశారు. స్థానికంగా జాన్కంపేట్ రైల్వేస్టేషన్ వద్ద నిర్మితమౌతున్న నిర్మాణ పనుల కోసమని స్థానికంగా వెయ్యి గజాల స్థలంలో అనుమతులు ఇవ్వగా ఘనులు మాత్రం గుట్టను మాయం చేశారు. దాదాపు ఒక్కొక్క విద్యుత్ స్తంబం మునిగిపోయే స్థాయిలో గుట్టలను తొలిచి మొరంను తరలించారు.

Malkapur (A) Guttamayam

మొరం తరలింపునకు గొడ్డళ్ళ వెనుక జీవోల ఘనుడు ఉన్నట్లు వినికిడి. ప్రజాప్రతినిధికి 30 శాతం వాటా ఇవ్వాలన్న ఒప్పందం మేరకు రాత్రిపగలు గుట్టను తవ్వేసి నిజామాబాద్ కు, నవీపేట్, ఎడపల్లి మండలానికి మొరాన్ని తరలించారు. ఒకప్పుడు గుట్టగా ఉన్న ప్రాంతం ఇప్పుడు లోతైనా కందకాలతో ఉండడం విశేషం. రెవెన్యూ శాఖ అనుమతి లేకుండానే మైనింగ్ శాఖకు ఎలాంటి రాయాల్టీ ఫీజులు చెల్లించకుండానే జరిగిన తతంగం వెనుక అధికార పార్టీ ముద్ర ఉండడంతోనే అధికారులెవ్వరు కన్నెత్తి చూడలేదు. ప్రధానంగా మైనింగ్ శాఖ ఇప్పటి వరకు అక్కడికి వెళ్లకపోవడం ఒక కారణమైతే రెవెన్యూ శాఖ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల బీజేపీ నాయకులు స్థానికంగా ధర్నా చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజాప్రతినిధికి వ్యక్తిగతంగా సహాయకుడిగా వ్యవహరిస్తున్న జీవోల ఘనుడు అంతా తానై వ్యవహరించడంతో అటువైపు కన్నెత్తిచూడడానికి పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారులు సాహసం చేయలేదు.

Malkapur (A) Guttamayam

ప్రభుత్వ అసైన్డ్ భూమే కాకుండా పేదలకు ఇచ్చిన భూముల్లో తవ్వకాలు చేసి మొరం తరలించిన గొడ్డళ్ళ ఘనుడు తర్వాత కందకాలను పూడ్చివేయకపోవడంపై పట్టాదారులు మండిపడుతున్నారు. ఈ విషయంపై జాన్కంపేట్ గ్రామానికి చెందిన విశ్రాంత జైలర్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ భూమిలో మొరం తవ్వుతున్న వారు వాటిని చదును చేయలేదని, దాని వల్ల తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని వాపోయారు. ఇటీవల మొరం క్వారీ వద్దకు బీజేపీ నాయకులు వచ్చి వెళ్లిన తర్వాత కదలిన యంత్రాంగం అక్కడ తవ్వకాలను చేయవద్దని చెప్పి బంద్ చేయించినట్లు తెలిసింది. వందల టిప్పర్లు, జేసీబీలతో గంటలకొద్ది జరిగిన తవ్వకాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం కేజీఎఫ్ సినిమాలోని క్వారీని తలపిస్తుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఇందిరమ్మ ఇళ్ళ పేరు ఎత్తకుండానే వందల టిప్పర్ల మొరాన్ని తరలించి లక్షలు వెనకేసుకున్న వైనంపై ప్రజాప్రతినిధికి సమాచారం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు, జీవోల ఘనుడుతో కలిసి ఈ తతంగం నడిపినట్లు అంతా కోడైకూస్తోంది. గడిచిన నెలలో స్థానికంగా అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు పట్టుకోగా జీవోల ఘనుడు పైరవీ చేసి విడిపించిన వ్యవహరం బట్టబయలైంది. లక్షల రూపాయల మొరాన్ని అమ్ముకుని వెనకేసుకున్న నాయకుల వ్యవహరం ఇప్పుడు రూరల్ మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Malkapur (A) Guttamayam