Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2025, 5:50 pm Posted by : ramakrishna

ఇందూర్‌లో తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

ఇందూర్, బతుకమ్మ: ఇందూర్‌లో తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. భారత సైనికుల ఘన విజయం “ఆపరేషన్ సిందూర్”కు అద్దంపట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “తిరంగా ర్యాలీ” కోసం ఇక్కడ ఇందూర్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జి.వి. కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మరచిపోదని పేర్కొన్నారు. ఆ ఘటనకు బదులుగా మోదీ ఆదేశాలతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో, కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు. కాందహార్ హైజాకింగ్, పుల్వామా దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల హతమర్చడం ప్రత్యేకమన్నారు. పాకిస్థాన్ సామాన్యులపై కాకుండా టార్గెట్ చేసిన విధానం భారత సైనిక నీతికి నిదర్శనమన్నారు. ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్ S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమికొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ రక్షణ రంగానికి లభించిన ప్రోత్సాహానికి చక్కని ఉదాహరణ అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీయంగా యుద్ధ పరికరాల తయారీ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ విజయానికి గుర్తుగా, జాతీయ గౌరవానికి సంకేతంగా, ‘మనమూ దేశం కోసం’ నినాదంతో ఇందూర్ నగరంలో భారీ తిరంగా ర్యాలీని మే 19, సాయంత్రం 4:00 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా (RR చౌరస్తా) నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓంప్రకాశ్ దైమా, డా. వెంకటరమణ, యాదగిరి, నరసింహ, గజం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచారెడ్డి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.