ఆర్మూర్, బతుకమ్మ :
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్ లో జరిగే ర్యాలీ ధర్నా విజయవంతం చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ లో ధర్నాకు సంబంధించి గోడప్రతులు, కరపత్రాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు పి. శంతన్, ఎం. బాలయ్య, కె.ఓమాజి, విజయ్ కుమార్, నరేందర్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ ప్రతిష్టతకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూళ్లకే పక్కా భవనాలు, భౌతిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను వేలాది పాఠశాలలను పాతర వేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ స్థాపనను మానుకోవాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలని సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.విద్యాశాఖ విడుదల చేసిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే విరమించుకోవాలని, మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం, స్నాక్స్ కు సంబంధించిన విషయంలో ఇస్కాన్ సంస్థకు, వందేమాతర ఫౌండేషన్లకు అప్పజెప్పే నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను, ఎంఈఓ, డీఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేసి పర్యవేక్షణను పెంచాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి బదులు రాష్ట్రంలోనున్న 17 విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు ఏక్ నాథ్, మదర్, ఓ. శ్రీనివాస్, వినోద్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.