Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 6:39 pm Posted by : ramakrishna

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

. . . కార్మిక సంఘాల జేఏసీ పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లాలోని హమాల్ వాడి, సిఐటియు ఆఫీసులో మంగళవారం కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందని, మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస  పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జీ. భూమయ్య తదితరులు పాల్గొన్నారు.