Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 4:17 pm Posted by : ramakrishna

23న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయండి

ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు అధ్యక్షులు మాధరి రాజన్న ఆధ్వర్యంలో నవంబర్ 23వ తేదీన హైదరాబాదులోని సరూర్నగర్ గ్రౌండ్లో జరిగే మాలల రణభేరి మహాసభ కరపత్రాలను పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు  చొక్కాం దేవదాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్  హాజరై మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు చోక్కం దేవదాసు మాట్లాడుతూ నవంబర్ 23న హైదరాబాదులో జరిగే మాలలరణభేరి మహాసభను విజయవంతం చేసేందుకు ఆర్మూర్, పరిసర ప్రాంతాల్లోని మాల సామాజిక వర్గం అంతా పెద్ద ఎత్తున ఈ సమావేశం లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపిరికల్ డాటా లేకుండా కులాలవారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను రాష్ట్రప్రభుత్వం వెంటనే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చేవెళ్ల డిక్లరేషన్కు కట్టుబడి ప్రస్తుత ఎస్సీల జనాభా కనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పెంచి దళితులకు న్యాయం చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వారి ఉన్నత విద్యకు సహకారం అందించాలని అట్లాగే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాల సామాజిక వర్గానికి మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులతో కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు మాధరి రాజన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, జిల్లాస్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి దళితుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి షెట్పల్లి నారాయణ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బీస భూమయ్య,పింజ పెద్ద భోజన్నగారు, జిల్లా కార్యదర్శి మక్కం గంగాధర్ గారు,పులి ముతేన్న గారు,డివిజన్ ప్రధాన కార్యదర్శి ముగా ప్రభాకర్,అంబులెన్స్ రాజు,బేగారి విజయరావు, పిట్ల దయాకర్,ద్యావతి రమేష్,సూదం రాజారామ్,బేగారి దేవదాసు తదితరులు పాల్గొన్నారు.