- యూపీఎఫ్ జాగృతి నేతలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేపట్టిన 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యూపీఎఫ్ జాగృతి నేతలు పిలుపునిచ్చారు. నిజమాబాద్ నగరం లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 4, 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని దీక్ష చేస్తున్నారని తెలిపారు. బీసీల బోనమెత్తుకున్న బహుజన బతుకమ్మ కవితమ్మ అని, సామాజిక ఉద్యమాల్లో సామాజిక అంశాల పట్ల తెలంగాణ జాగృతి ఆవిర్భావం నాటి నుండే కవిత అగ్ర భాగాన నిలబడ్డారని అన్నారు. గతంలో అనేక అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో పోరాడారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న అంశంపై నోరు మెదపడం లేదని అన్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవిత అన్ని జిల్లాల్లో బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక ధర్నాలు, బిసి మేధావులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిటీకి సమగ్ర నివేదికను సైతం అందజేయడం వల్లనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై చలనం వచ్చిందన్నారు. ఒకవైపు పార్లమెంటుకు బిల్లును పంపి మరొకవైపు ఆర్డీనెన్సు ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తామనడలంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి బీసీల పట్ల ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయని అన్నారు. తక్షణమే బీసీలకు 42 శాతం రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ తో కవిత ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షను చేయనున్నారని, ఈ దీక్షకు విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున బిసి కులాలకు సంబంధించిన నాయకులు, పూలే ఫ్రెంట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు ,జాగృతి అధ్యక్షులు సాల్వా చారి,అవంతి కుమార్ డా.శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నిగంటల మురళి, యునైటెడ్ పూలే ఫ్రెంట్ నాయకులు దర్శనం దేవేందర్, తెలంగాణ శంకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి భరద్వాజ్, నాయకులు పంచ రెడ్డి, మురళి, హరీష్ యాదవ్, ఆకాష్, శోభ, సరిత, రేఖ, రాణి, సంతోష్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అజయ్, నాయకులు చంద్రకాంత్, మీసాల శంకర్ పాల్గొన్నారు.
