Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:20 pm Posted by : ramakrishna

తృటిలో తప్పిన భారీ ప్రమాదం

 

. . . ఇంటి పక్కనే పిడుగు

 

. . . టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు దగ్ధం

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ఈ క్రమంలో జుక్కల్ మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలో పిడుగు పడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన సబ్‌దేవర్ శంకర్ ఇంటి పక్కనే అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో సుమారు 8 నుంచి 10 మంది కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దంతో అందరూ ఉలిక్కిపడి నిద్రలేచి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పిడుగు ప్రభావంతో ఇంటి గోడలకు బీటలు ఏర్పడగా, ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, విద్యుత్ మీటర్, ఫ్యాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అంతేకాకుండా భారీ శబ్దం కారణంగా వంటగదిలోని పాత్రలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పిడుగు ఇంటి పక్కనే పడినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సంఘటనతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు ఇంకా ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. స్థానికులు ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.