. . . విద్యుత్ కాంతులతో వెలుగుతున్న బిచ్కుంద వీధులు
బిచ్కుంద, బతుకమ్మ :
మహాశివరాత్రి సందర్భంగా బిచ్కుంద పట్టణంలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని మఠ పీఠాధిపతి సోమయ్యప్ప మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశి పవిత్రత కలిగిన బిచ్కుంద శివాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి ఫిబ్రవరి 17 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ప్రత్యేక పూజలతో ఫిబ్రవరి 15 నుంచి జాతర ప్రారంభం కానుందని, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగే స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నారని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి భారీ స్థాయిలో భక్తులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను అందుకుంటారని అన్నారు. ఫిబ్రవరి 16 సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, 17వ తేదీన కుస్తీ పోటీలు నిర్వహిస్తారని మఠ పీఠాధిపతి తెలియజేశారు. అదేవిధంగా ప్రతి రోజు అభిషేకాలు కుంకుమ పూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన జాతరలో పిల్లలకు పెద్దలకు వినోదాన్ని కల్పించేందుకు జెయింట్ వీల్, డోరాతో బ్రేక్ డాన్స్, హంస, రైలుతో పాటు భక్తులకు వినోదాన్ని కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం జరిగే మహా శివరాత్రి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సతీ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం : మఠ పీఠాధిపతి సోమయ్యప్ప
మహాశివరాత్రి సందర్భంగా బిచ్కుంద శివాలయంకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మఠ పీఠాధిపతి సోమయ్యప్ప తెలిపారు. జాతరలో తొక్కిసలాట జరగకుండా భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా పైపులైను, స్నాన ఘట్టాలు ఏర్పాటు, మహిళలకు ప్రత్యేకంగా స్నానఘట్టాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.
