. . . ఎస్సీ వర్గికరణ తరువాత జిల్లాలో కొత్తగా సర్టిఫికేట్ల జారీ
. . . కుల సంఘం ముసుగులో వసూళ్లకు తెగబడిన నేతలు
. . . జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టి ఎమ్మార్పిఎస్
నిజామాబాద్, బతుకమ్మ:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాంగ్ (ఎస్సీ గ్రూప్ :1వ.సంఖ్య .7) కులస్తులు అక్రమంగా మాదిగ (ఎస్సీ గ్రూప్ బి 2వ. సంఖ్య11) కుల పత్రాలు పొంది మాదిగలకు రావలసిన అవకాశాలను కొల్లగొడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాదిగలకు న్యాయం చేయాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు లిఖిత పూర్వకంగా టి ఎమ్మార్పిఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసింది.

ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ…. ఎస్సీ వర్గీకరణ ప్రకారం గ్రూప్ 1లో ఉన్న మాంగ్ కులం (క్రమ సంఖ్య :42 గ్రూప్ వ. సంఖ్య:7) వీరి మాతృభాష మరాఠీ, వీరి వృత్తి మాదిగలతో సారూప్యం ఉన్నప్పటికీ సంస్కృతి సంప్రదాయాలు మాదిగలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీరు గత కొన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో అక్రమంగా మాదిగ కుల పత్రాలను పొంది ఉన్నారు. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేయకుండా మాంగ్ కులస్తులకు ‘మాదిగ కుల పత్రాలు ’జారీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భంగా గ్రూప్ బి 2 లో ఉన్న మాదిగ కులస్తులకు (క్రమ సంఖ్య.31,గ్రూప్ వ. సంఖ్య.11 వీరి వల్ల అన్యాయం జరుగుతుంది. మాదిగలకు రావలసిన ప్రభుత్వ పథకాలు (విద్య,ఉద్యోగ,ఉపాధి) అవకాశాలు కొల్లగొడుతున్నారు. పూర్వ నిజాం ప్రభుత్వం కాలం నుండి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండే మాంగ్ కులస్తులు ఆనాటి ప్రభుత్వం షెడ్యూల్ కులంగా గుర్తించింది (క్రమ సంఖ్య: 42).అదే సమయంలో మాదిగలు (క్రమ సంఖ్య: 31) కూడా షెడ్యూల్ కులాల జాబితాలో కలిసి ఉన్నప్పటికీ విభిన్న భాషా సంస్కృతులు కలిగి ఉంటారు. కొంతమంది నాయకులు మాంగ్, మాదిగలు ఒకటే అని తప్పుడు ప్రచారం చేస్తూ నిజమైన మాదిగలకు ద్రోహం చేస్తూ నాయకులు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు నాయకులు సంబంధిత లేటర్ ప్యాడ్ లను తయారు చేసి మాంగ్ కులస్థులకు మాధిగలుగా సర్టిఫికేట్ల జారీకి వసూళ్లకు తెరలేపారు. ఒక్కోక్కరి నుంచి రూ.10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేసి మాదిగలుగా ధ్రువీకరణ పత్రాల జారీకి తెరలేపారు. సంబంధిత రెవిన్యూ అధికారులు కుడా కేవలం కులసంఘం లెటర్ ప్యాడ్ అధారంగా మాంగ్ కులస్ధులకు మాదిగలుగా సర్టిపికేట్లను జారీ చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల ఎస్సీ వర్గీకరణ లో మాంగ్ కులస్తులు గ్రూప్ 1లోని ప్రయోజనాలను గ్రూప్ 2 లోని ప్రయోజనాలను మాదిగల విద్యా, ఉద్యోగ, ఉపాధి లోని ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ గ్రూప్-2 లో ఉన్న మాదిగ కులస్తులకు అన్యాయం చేస్తున్నారు. కావున జి.ఓ.యాం.యస్. నెంబర్ : 58 ప్రకారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచార కమిటీ (స్కూట్నీ కమిటి) ని ఏర్పాటు చేసి గతంలో అక్రమంగా తప్పుడు మాదిగ కుల పత్రాలు పొందిన మాంగ్ కులస్తుల కుల ధ్రువీకరణ పత్రాలను రద్దుచేసి, వారికి మాంగ్ కుల పత్రాలు జారీ చేయాలని, అదేవిధంగా తప్పుడు మాదిగ పత్రాలు పొందిన మాంగుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకులు దుర్గయ్య మాదిగ, రమేష్ మాదిగ, ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.