వెబ్ డెస్క్, బతుకమ్మ :
అమెరికాలో కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీ కారు ప్రమాదంలో గాయపడ్డారు. బోస్టన్ నుంచి న్యూయార్క్ వైపు ప్రయాణిస్తుండగా వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డాక్టర్ సుచి యాష్కీకి రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. వివరాల ప్రకారం, డాక్టర్ సుచి యాష్కీ తమ కుమార్తె డాక్టర్ గగన యాష్కీని అమెరికాలోని ఎండీ కోర్సులో చేర్పించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ సమయంలో లగేజీ ఎక్కువగా ఉండటంతో మధు యాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. రేపు వారు భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత స్థానిక సహాయంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అవసరమైన చికిత్స కొనసాగుతోందని తెలిపారు.