. . . నేడే మున్సిపల్ ఫలితాలు
. . . రిజల్ట్ పై అభ్యర్థుల్లో ఉత్కంఠ
. . . రాజకీయ పార్టీల్లో గుబులు
నిజామాబాద్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం బల్ధియా ఎన్నికల రిజల్ట్ ను అధికారులు ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత నెల 28న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నెల 11న ఓటింగ్ జరిగిన విషయం తెల్సిందే. పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలలో పోటీ చేసిన అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్ లలో 116 మున్సిపాలిటీలలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. గెలుపు కోసమే రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు మంచినీళ్ళ ప్రాయంలా డబ్బులు ఖర్చు చేసిన విషయం తెల్సిందే. పోలింగ్ ఫలితాలతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల భవితవ్యం వెల్లడికానుంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలతో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపోల్స్ ఫలితాలు ఉదయం 11 గంటల వరకే తేలిపోనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 61.90 శాతం ఓటింగ్ నమోదయింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 59.12 శాతం ఓటింగ్ నమోదు కాగా ఆర్మూర్ 68.00, బోధన్ లో 68.54, భీంగల్ లో 69.78 శాతం ఓటింగ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో 69.48 శాతం ఓటింగ్ నమోదైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 65.94 శాతం, ఎల్లారెడ్డిలో 79.77 శాతం , బాన్సువాడలో 73.66 శాతం , బిచ్కుందలో 78.49 ఓటింగ్ శాతం నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రాంతాలలో డీఎన్ఎస్ 163 యాక్టును అమలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమ్మిగూడడాన్ని పోలీసు శాఖ నిషేదించింది. ఫలితాల తర్వాత ర్యాలీలను, ఊరేగింపులను కూడా నిషేదించారు. అయితే ఫలితాలపై సర్వే రిపోర్టులు, ఎగ్జిట్ పోల్స్ లు వేర్వేరుగా ఉండడంతో రిజల్ట్ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తర్వాత జరుగుతున్న బల్ధియా ఎన్నికలలో ఎవరిది ఆధిపత్యమనేది తేలిపోనుంది. గత మున్సిపల్ ఎన్నికలలో ఖాతా తెరువని కాంగ్రెస్ ఈ సారి అధికారంలో ఉండడంతో అన్నీ మున్సిపాలిటీలపై జండా ఎగురవేస్తామని ధీమాతో ఉంది. బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, ఆర్మూర్ స్థానాలపై ఆశ పెట్టుకుంది. బల్ధియా ఎన్నికల్లో అన్నీ మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక్క మున్సిపాలిటీనైనా దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ అని పందాలు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఖచ్చితంగా గెలువాల్సిన స్థానాలను దక్కించుకుంటామో లేదోననే సందేహాలు ఆ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. బీజేపీ మాత్రం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో రిపిట్ అవుతాయని ధీమాతో ఉంది. బీఆర్ఎస్ మాత్రం పూర్వవైభవం కోసం తహతహలాడుతుంది. పంచాయతీ ఎన్నికల మాదిరిగా పట్టణ ఓటర్లను ఆకట్టుకుంటామా లేదా అనే సందేహం వ్యక్తమౌతుంది. కొన్ని గంటలు గడిస్తే కానీ ఫలితాలపై ఉత్కంఠ వీడే అవకాశం లేదు.
. . . కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత
నిజామాబాద్ నగరంలోని ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను పాలిటెక్నిక్ కళాశాలకు తరలించారు. కళాశాలలో స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్స్ లను ఉంచి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే కౌంటింగ్ కోసం కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు ఏజంట్ ను అనుమతివ్వనున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి 5 కిలో మీటర్ల వరకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ వద్దని పోలీసులు హెచ్చరించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ, బైక్ ర్యాలీ, పటాకులు కాల్చడం, ఊరేగింపులను నిర్వహించడం పూర్తిగా నిషేదం.