- అభివృద్ధి పనుల పేరిట గుట్టలను కొల్లగొడుతున్న వైనం
రుద్రూర్, బతుకమ్మ : అక్రమార్కుల తాకిడికి ప్రకృతి సంపద అయిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఏకంగా మండల కేంద్రం సమీపంలో ఉండే గుట్టలను, కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేరిట మొరం తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా అక్రమంగా మొరం రవాణా చేస్తున్నారు. మొరం అక్రమ తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పగటి వేళ కాకుండా అర్ధరాత్రి వేళలో కూడా మొరం తవ్వకాలు చేపడుతున్నారని, అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు జేసీబీ సహాయంతో టిప్పర్లలో మొరం జోరుగా రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్ మొరం రూ.2వేల వరకు విక్రయిస్తుండగా, ఒక్కో టిప్పర్ మొరం రూ. 4 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ మొరం రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.