కాంగ్రెస్ కమిటీలు ఎప్పుడో?
జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేనా?
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నూతనంగా జిల్లా కాంగ్రెస్, నగర, పట్టణ, మండల, బ్లాక్ స్థాయి నూతన కార్యవర్గాల ఎంపికపై సందిగ్ధం కొనసాగుతుంది. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నూతన కమిటీల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ అధినాయకత్వం, పీసీసీ చెబుతున్నప్పటికీ ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. తాజాగా రెండవ విడత మంత్రివర్గ విస్తరణ కూడా ముగిసింది. మూడవ విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో ఇప్పటికి స్పష్టత లేదు. ఇటీవల పీసీసీ కార్యవర్గ నియామకాలను ఏఐసీసీ పూర్తి చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ల పోస్టుల మినహా అన్నీ పోస్టులను భర్తీ చేశారు. దానితో పీసీసీ కార్యవర్గ భర్తీ పూర్తయినట్లేనని ఏఐసీసీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మిగిలిన కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడనే చర్చ జరుగుతుంది. అందుకు కారణం లేకపోలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లా కమిటీలతో పాటు సిటీ, పట్టణ, బ్లాక్, మండల కార్యవర్గాల కూర్పుపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడం, పీసీసీ కార్యవర్గం ఎన్నిక జరిగిపోవడంతో ఈ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమని తాజాగా పంచాయితీరాజ్ శాఖ మంత్రి సీతక్క రెండు రోజుల క్రితం ప్రకటన చేయగా ఆదివారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ పై స్పష్టత ఇచ్చారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్దమౌతున్న వేళ మంత్రులు ఇస్తున్న లీక్ లు కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపినట్లయింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కమిటీ పోస్టులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి కార్పొరేషన్ పదవి దక్కడంతో ఆ పోస్టుకు కొత్త వారి ఎంపిక ఖాయమైంది. నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు నుడా చైర్మన్ పదవి దక్కడంతో కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతుందని ఇది వరకే నాయకులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తారా? కొనసాగిస్తారా? అనేది కాంగ్రెస్ అధిష్టానం పై నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ కాంగ్రెస్, మండల, పట్టణ కమిటీల ఎన్నిక, ఇతర అనుబంధ ఎన్నికలను ఈ నెలాఖరు వరకే చేసేందుకే ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షీ నటరాజన్ పీసీసీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు కొత్త కమిటీలు ఎన్నిక అనేది లాంచనంగా మారింది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెడ్డిలకు కేటాయిస్తారని, దాని కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి మున్నూరు కాపులకు ఖరారు చేశారని ప్రచారం సాగుతుంది. రెండు పదవులకు పోటీపోటీగా అభ్యర్థులు తమ నాయకత్వం వద్ద పోటీ పడుతున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు జిల్లా స్థాయిలో ఉన్న కార్పొరేషన్ పదవుల కోసం ఆశవాహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో రెండు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇది వరకే భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లాలో మార్కెట్ కమిటీ పదవులను కూడా భర్తీ చేశారు. నిజామాబాద్ నుడా చైర్మన్ ను నియమించినప్పటికీ పాలకవర్గ డైరెక్టర్లను నియమించలేదు. ఆలయాల కమిటీల నియామకమే మిగిలింది. వాటి కోసం ఇది వరకే చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికే కొందరు పేర్లు ఖరారు చేసినప్పట్టికి వాటిని బహిర్గతం చేయలేదని సమాచారం. ఉమ్మడి జిల్లాలో వక్ప్ బోర్డు చైర్మన్లతో పాటు, ఇతర పదవుల భర్తీకి మైనార్టీలు కూడా తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన వారికే ఇతర పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ ప్రకటించిన విషయం తెల్సిందే.