Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 8:50 pm Posted by : ramakrishna

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • డిసెంబర్ 11, 14, 17 తేదిల్లో ఎన్నికలు
  • నవంబర్ 27 నుంచే తొలివిడత నామినేషన్ల స్వీకరణ

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పచ్చజండా ఊపింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వాహణకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు, 14న రెండవ విడత, 17న మూడవ విడత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి విడత ఎన్నికల కోసం ఈ నెల 27 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 30 నుంచి ప్రారంభించనున్నారు. చివరిది అయిన మూడవ విడత నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3న మొదలవుతుందని తెలిపారు. ఈ నెల 24న గ్రామ పంచాయితీల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంను గవర్నర్ ఆమోదించకపోవడం, 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని  హైకోర్టు ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం న్యాయస్థానం తుదితీర్పు ఆధారంగా ఎన్నికలకు సిద్దమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు కేటాయించేందుకు సిద్దమైంది. గతంలో 42 శాతం రిజర్వేషన్లతో ఇచ్చిన నోటిఫికేషన్ స్థానంలో కొత్తగా ప్రభుత్వం పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించడంతో సమీకరణలు మారనున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్దపడి ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు మహిళ సంఘాలకు రుణాలు పంపిణీ చేసిన విషయం తెల్సిందే.