Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 12:10 am Posted by : ramakrishna

కామారెడ్డిలో అలా..  నిజామాబాద్ లో ఇలా..

  • పోలీసింగ్ లో కామారెడ్డి ఎస్పీ దూకుడు
  • పది రోజుల్లో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
  • నిజామాబాద్ లో పోలీసింగ్ ను గాడిలో పెట్టడానికే యత్నాలు
  •  మెమోలకే పరిమితమా..?  చర్యలు ఎప్పుడో..?

 

నిజామాబాద్ , బతుకమ్మ :

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీసు బాసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే కామారెడ్డి ఎస్పీ మాత్రం పోలీసు అని కూడా చూడకుండా కొరడా ఝళిపిస్తున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ మాత్రం రంజాన్ మాసం వచ్చన తర్వాత దూకుడు పెంచారు. అయితే పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల విషయంలో అవినీతి, అక్రమాల విషయంలో మాత్రం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పోలీసు అధికారులను కూడా ఉపేక్షించడం లేదు. కామారెడ్డి జిల్లాలో పది రోజుల్లో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. మొన్నటికి మొన్న జుక్కల్ హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ కు గురి కాగా, తర్వాత రెండు రోజులకే తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు, గురువారం రామారెడ్డి ఎస్సై నరేష్ పై వేటు వేయడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షల ప్రశ్నలు బయటకు లీక్ కాగా వాటిని ఎస్పీ సమర్థివంతంగా కట్టడి చేశారు. పోలీసింగ్ ను గాడిన పెట్టడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

నిజామాబాద్ జిల్లాలో కొత్త కమిషనర్ గా పోతరాజు సాయిచైతన్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రోజులకే సైబర్ క్రైం పోలీసు కస్టడిలో ఉన్న గల్ప్ ఏజంట్ కస్టోడియల్ డెత్ కలకలం రేపింది. మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో విచారణ జరిపి సైబర్ క్రైం పోలీసుల అవినీతి, టార్చర్ తోనే చనిపోయాడని జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో జ్యుడిషియల్ విచారణ జరుగుతుందని, తామేమి చేయలేమని పోలీసు అధికారులు మిన్నకున్నారు. ఇదిలా ఉండగా గత కమిషనర్ హయంలో జరిగిన మహిళపై అమానుష లాఠీచార్జి వ్యవహరంలో బోధన్ రూరల్ సిఐకి చార్జి మెమో మాత్రం ఇచ్చారు. తర్వాత పోలీసు శాఖలో నిజామాబాద్ జిల్లాలో ఎవరిపై చర్యలు తీసుకున్నట్లు దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం పలువురు ఎస్సైలకు స్థానచలనం చేశారే కానీ కనీసం మెమో కూడా ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ లు, సివిల్ పంచాయితీలకు అడ్డాలుగా మారాయి. ఇసుక , మొరం దందా అడ్డుఅదుపు లేకుండా సాగుతుంది. మొన్నటికి మొన్న నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వడ్డీ వ్యాపారంపై పోలీసు శాఖ మూడు సబ్ డివిజన్ లలో ఒక్క రోజే మెరుపు దాడులు చేసి 80 లక్షల పై చిలుకు నగదుతో పాటు బాండ్ పేపర్లు, సెల్ డీడ్ లు, ప్రామిసరి నోట్లు స్వాధీనం చేసుకోవడం ఒక్కటి మాత్రం చేశారని చెప్పాలి. తర్వాత ఆ వ్యవహరం ఎటు తేలలేదు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పోలీసు బాసులు ఒక్కరోజే నియమితులయ్యారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్న ఇందూరు పాలకులు జిల్లాలో విభజనలో రెండు జిల్లాలుగా రూపాంతరం చెందాయి. తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ తర్వాత అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ గా నిజామాబాద్ రికార్డులకెక్కింది. నిజామాబాద్ లో మూడు సబ్ డివిజన్ లతో పాటు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ లు, సైబర్ క్రైం, ఎస్ బి, ఏఆర్, సీసీఎస్, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్ లాంటి విభాగాలకు కూడా అసిస్టెంట్ కమిషనర్లు ఉన్న విషయం తెల్సిందే. డజన్ కు పైగా సీఐలు, 50కిపైగా ఎస్సైలు ఉన్న పెద్ద జిల్లాగా నిజామాబాద్ కు పేరుంది. కామారెడ్డి జిల్లాలో మూడు సబ్ డివిజన్లు ఉండగా అతి చిన్న జిల్లాగా పేరుంది. అయితే పోలీసింగ్ లో మాత్రం కామారెడ్డి పోలీసు అధికారుల వ్యవహర శైలి కారణంగా అక్కడ పోలీసింగ్ లో సమూల మార్పులు మొదలయ్యాయని చెప్పాలి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జనవరి మాసం నుంచి వర్ని, లింగంపేట్ ఎస్సైలు ఇద్దరు ఏసీబీకి చిక్కారు.అందులో విశేషమేమిటంటే ఇద్దరు వరుసగా ఎస్సైలు అవినీతి నిరోదక శాఖకు చిక్కగా కొత్త పోలీసు బాసు అలసత్వాన్ని, అవినీతిని ఉపేక్షించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో మాత్రం పోలీసు శాఖలో తమకు ఎమ్మెల్యే అండ ఉందని తమను ఎవరు ఏం చేయలేరన్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఏప్రిల్ మాసంలో నిజామాబాద్ సబ్ డివిజన్ లోని నగర శివారులోని ఒక గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఎస్సై ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడానికి రూ.50 వేలు డిమాండ్ చేసిన వ్యవహరం కలకలం రేపింది.