Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 5:32 pm Posted by : ramakrishna

మర్డర్ కేసులో ఒకరికి జీవితఖైదు

 

. . .నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

బూతు మాటలు తిట్టాడు అని ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయి బైరి నర్సాగౌడ్ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం  తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తాటిపాముల శివప్రసాద్ గౌడ్, బైరి నర్సాగౌడ్ నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట మల్కాపూర్ గ్రామ వాస్తవ్యులు.2024 జూన్ 6 న ఉదయం శివప్రసాద్ దైవ దర్శనం చేసుకుందామని వెళ్తుండగా మార్గమధ్యలో నర్సాగౌడ్ ఎదురు పడటంతో తనను ఉద్దేశించి శివప్రసాద్ బూతు మాటలు తిట్టిండు అని కోపగించి దగ్గరలో ఉన్న కట్టేతో తలపై కొట్టి గాయపరచాడు.తనను చెప్పుకోలేని బూతు మాటలు తిట్టాడు అని మనసులో రగిలిపోయిన మరింత కోపం తెచ్చుకున్న నర్సాగౌడ్ మల్లి మధ్యాహ్నం మూడు గంటలకు శివప్రసాద్ ఇంటికి వెల్లి వెంట తెచ్చుకున్న కట్టేతో బలంగా తలపై ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన అతనిని కటుంబ సభ్యులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు.ఆ తర్వాత అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు.ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లడంతో శివప్రసాద్ బతికే అవకాశాలు లేవని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్లిన తరువాత అతను మరణించాడని వారు తెలపడంతో పోలీసులు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహింప జేశారు. సమగ్ర నేర విచారణ అనంతరం పోలీసు అధికారులు ఛార్జీషీట్ ను కోర్టులో సమర్పించారు.ముద్దాయి నర్సాగౌడ్ పై హత్య నేరం రుజువు అయినట్లు నిర్ధారించింది. హత్యనేరంకుగాను జీవితఖైదు తో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలి జడ్జి తమ తీర్పు లో పేర్కొన్నారని పి పి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు