Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 2:05 pm Posted by : ramakrishna

సాయుధ పోరాటం ఫలితంగా తెలంగాణకు విముక్తి

 

Liberation of Telangana as a result of armed struggle

కామారెడ్డి, బతుకమ్మ: 

తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణ పై ఆంక్షలు, మాతృభాషా అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు తొలగి 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని  తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  రమేష్ రెడ్డి మాట్లాడుతు… తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వ మతాలను సమాదరిస్తూ శాంతిసామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో ప్రభల విల్లుచున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుందని చెప్పారు.

 

Liberation of Telangana as a result of armed struggleఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల 50 వేల ఇల్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రైతులకు పంటల బీమా పథకం వర్తింప చేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వ్యవసాయ, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు వీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ నిఖిత, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.