. . . యువకుడిపై నలుగురి దాడి
. . . అతని బైక్ ధ్వంసం
. . . బాధితుని ఫిర్యాదు మేరకు కేసు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. యువకులు మద్యం మత్తులో దాడులకు తెగబడుతున్నారు. స్థానిక చోటామోట లీడర్ల అండతో అమాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని హమలవాడి చౌరస్తాలో ఈనెల 14 రాత్రి ఆకుల కొండూరు సమీపంలోని అశోక్ ఫారంకు చెందిన అబోల్ల చందు అనే యువకుడి పై దాడి జరిగింది. ఇటీవల కాలంలో అక్కడ చందు బట్టల షాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నెల 14న అతని స్నేహితుడు కమలేశ్ అలియాస్ సన్నీ వద్దకు వచ్చాడు. స్థానికంగా ఉండే మోసిన్ అనే వ్యక్తి చందును హమాల్ వాడి చౌరస్తాకు రావాలని పిలిచాడు. అక్కడికి వచ్చిన చందును మోసిన్ ఇక్కడ బట్టల షాప్ ఓపెన్ చేస్తున్నావట కదా దాని ధ్వంసం చేస్తా ఎలా ఓపెన్ చేస్తావో చూస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా మోసిన్ అతని తమ్ముడు యాసిన్, రాఖీ, అభిలు చందుపై దాడి చేసి కొట్టారు. బాధితుడు అక్కడినుంచి వెళ్ళిపోగానే మోసిన్, కమలేష్ ఫోన్ చేసి రమ్మని పిలిచారు. చందు రాకపోవడంతో వారి వద్ద ఉన్న అతని బైక్ ను డ్యామేజ్ చేశారు. బాధితుడు చందు అదే రోజు రాత్రి మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా మిత్రులే మద్యం మత్తులో కొట్టుకున్నారని తాత్సారం చేయడం విశేషం. చందు పై దాడి చేసిన ఇద్దరు సోదరులకు నేరచరిత్ర ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.