Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 6:08 pm Posted by : ramakrishna

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దాం

  • ఏఐఎస్బీ రాష్ట్ర నాయకులు జవారే రాహుల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని ఏఐఎస్బీరాష్ట్ర నాయకులు జవారే రాహుల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర నాయకులు జవారే రాహుల్, జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి వారం రోజులు కావస్తున్న తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో  విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఇవ్వవలసిన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బట్టలు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారన్నారు. మరియు పాఠశాలల్లో కళాశాలలో మరుగుదొడ్లు టాయిలెట్లు, మంచినీటి వసతి, ఫ్యాన్లు,ట్యూబ్ లు, ఫర్నిచర్ సదుపాయాలు కల్పించలేకపోయారు అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యా ప్రారంభిస్తున్నాం అని ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు కేవలం నీటి మీది రాతలు గానే మిగిలాయి తప్ప ఆచరణకు నోచుకోలేకపోతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి మెరుగైన విద్యను అందించవలసిన పాలకులు ప్రభుత్వ విద్యను నీరుగార్చుతున్నారన్నారు. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నీరుగార్చుతూ, మరోపక్క ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను పెంచి పోషిస్తున్నారు అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్  పాఠశాలల్లో, కళాశాలల్లో ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారమయం చేసి, వ్యాపారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో, కళాశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు లెక్చరర్లు లేకపోయినా కనీసం వారి విద్యా అర్హతలు కూడా విద్యాధికారులు తెలుసుకోకుండా ప్రైవేట్ విద్యా వ్యాపారానికి రెడ్ కార్పేట్ వేసి సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్య అంగడి సరుకుగా మారిందన్నారు. సేవా దృక్పథంతో ఉండవలసిన విద్య నేడు వ్యాపార దృక్పథంతో కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలలో ఇష్టారాజ్యంగా టై, బెల్టు, షూస్, డ్రెస్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అనీ, అడ్మిషన్ ఫీజులని, డొనేషన్స్ ఫీజులు అనీ, ట్యూషన్ ఫీజులని, బస్ ఫీజులు అనీ, స్లిప్ టెస్ట్ ఫీజులు అని, టెస్టులకు పేపర్ ఖర్చులు అని, కర్ క్యూలం ఫీజలు అనీ, ఆటవస్తువులకని, ఫుడ్ ఫీజ్ అని, బెడ్ ఫీజ్ అని ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల ఫీజుల పేర్లు చెప్పి పిల్లల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారన్నారు. పిల్లల ఫీజులు చెల్లించుకోవడం కోసం భూములు,  ఆస్తులు అమ్ముకొని, ఫైనాన్సుల్లో అప్పులు తీసుకొని చెల్లిస్తున్నారన్నారు. ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యాలు. ఇవన్నీ తెలిసిన విద్యాధికారులు, ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది అన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ రంగంలో విద్యను సెక్షన్ల వారిగా, స్పార్క్ బ్యాచిలని, స్పెషల్ బ్యాచిలని ఇలా విభజించి బోధన చేస్తున్నారు. ఇప్పటికే విద్య మొత్తం పేద, మధ్యతరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. కాబట్టి అందరికీ విద్య అందాలంటే పోరాటం ఒకటే మార్గమని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రమేష్, విప్లవ కుమార్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.