Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 5:14 pm Posted by : ramakrishna

అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిద్దాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విప్లవద్యమంలో అమరులైన వారికి స్మరిస్తూ సీపీఐఎంల్ మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేకించి 58 ఏళ్ల భారత కమ్యూనిస్టు విప్లవద్యమంలో ప్రజల కోసం ఈ దేశంలో ప్రజాతంత్ర, సోషలిస్టు విప్లవం కోసం పోరాడి ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. భారతదేశంలో వర్గపీడన, దోపిడీ, కుల వ్యవస్థ, మతాలు, మూఢనమ్మకాలు, సాంఘిక, రాజకీయ అసమానతలు, ఆర్థిక అంతరాలు పోవాలని అమరవీరులు కలలుగన్నారన్నారు. ఆ ఆశయం వెలుగులో ప్రజలను కూడగట్టి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు నిర్వహించారన్నారు. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్, డీవీ కృష్ణ, రామ నరసయ్య, చంద్రశేఖర్, దొరన్న, లింగన్న నిజామాబాద్ జిల్లాలో జేసిఎస్ ప్రసాద్, యాదగిరి, కిరణ్ కుమార్, ఎల్లన్న, శావలం సాయిలు, కుమార్ తదితరులు ఎందరో తమ జీవితాలను విప్లవోద్యమం కోసం దారపోశారన్నారు. గ్లోబలైజేషన్, మతోన్మాదం, ఫాసిజం విసురుతున్న సవాళ్ల మధ్య కమ్యూనిస్టు ఉద్యమంలో వస్తున్న లిక్విడేషనిజం, కెరియరిజం, పిడివాద ధోరణులను ఎదుర్కొని బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణానికి పూనుకోవాలన్నారు. అమరుల తలంపులో కాలాన్ని కౌగిలించుకుని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేయడమే అమరులకు నిజమైన నివాళి అని అన్నారు.  ఈ సంస్మరణ సభలో సీఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, పీ.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, టీయుసీఐ జిల్లా నాయకులు లింగం, కిరణ్, రవికుమార్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, నాయకులు అమూల్య, చరణ్, శివకుమార్, గంగాధర్, శంకర్, పద్మ, కవిత, లక్ష్మి, జలంధర్, సరళ తదితరులు పాల్గొన్నారు.